India China Clash:


అందరి మాటా విన్నారు: శశి థరూర్


తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం కొనసాగుతోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన వివరణపై అసంతృప్తిగా ఉన్నామని కాంగ్రెస్ మండి పడుతోంది. పార్లమెంట్‌లో ఈ విషయమై పెద్ద ఎత్తు వాగ్వాదం జరగ్గా..కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఈ క్రమంలోనే...కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి థరూర్ ఈ పరిణామాలపై స్పందించారు. చైనా విషయంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యవహరించిన తీరుని గుర్తు  చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. "1962లో చైనాతో యుద్ధం జరిగిన సయయంలో పార్లమెంట్‌లోని అందరి సభ్యులతో మాట్లాడారు. సభ సజావుగా సాగేలా చూశారు. అందరి మాటా విన్నారు. దాదాపు 100 మంది ఎంపీలు ఆయనతో చర్చించారు. ఆ తరవాతే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చలు అవసరం అని ఆయన అప్పట్లోనే చెప్పారు. బీజేపీ మాత్రం కాంగ్రెస్‌పై దాడి చేయడమే పనిగా పెట్టుకుంటోంది. నెహ్రూ చైనా విషయంలో చాలా సాఫ్ట్‌గా ఉన్నారని విమర్శిస్తోంది. యుద్ధం వల్ల అప్పట్లో భారత్ బాగా నష్టపోయిందని ఏదో సాకులు చెబుతోంది. ఈ రెండు కారణాలు చూపించి కాంగ్రెస్‌పై దాడికి దిగుతోంది" అని అసహనం వ్యక్తం చేశారు శశి థరూర్. పార్లమెంట్‌లో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. జాతీయ భద్రత అంశమైనా, అందులో కొన్ని రహస్యంగా ఉంచాల్సినవైనా...కొన్నింటిపై మాత్రం తప్పకుండా చర్చించే అవకాశం కల్పించాలని సూచించారు. రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని అన్నారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ఏదో పొడిపొడిగా వివరణ ఇచ్చారని..ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండి పడ్డారు. 


తవాంగ్‌పై డ్రాగన్ కన్ను..


గతేడాది అక్టోబర్‌లో తవాంగ్‌లోనూ కవ్వింపు చర్యలకు పాల్పడింది చైనా. దాదాపు 200 మంది చైనా సైనికులు భారత భూభాగమైన తవాంగ్‌లోకి చొచ్చుకుని వచ్చారు. అటు భూటాన్, ఇటు టిబెట్‌తో సరిహద్దు పంచుకుంటోంది తవాంగ్. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణలు జరిగినప్పటి నుంచే వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి భారత్ భద్రతను కట్టుదిట్టం చేసింది. అటు చైనా కూడా అదే స్థాయిలో సైనికులను మోహరించింది. వాస్తవానికి...అరుణాచల్‌ ప్రదేశ్‌ను "దక్షిణ టిబెట్" అని క్లెయిమ్ చేసుకుంటోంది చైనా. అందులోనూ తవాంగ్‌ను ఆక్రమించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇక్కడ భారత సైన్యం కదలికలు చాలా చురుగ్గా ఉంటాయి. అందుకే...తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు తరచూ గొడవలకు దిగుతూ ఉంటుంది చైనా సైన్యం. ఈ ప్రాంతం భారత్‌కు భద్రత పరంగా ఎంతో వ్యూహాత్మకం. ఇక భారత్‌ వైపు చూస్తే...తవాంగ్‌తో పాటు చంబా వ్యాలీ కూడా కీలకమే. చైనా భూటన్ సరిహద్దుకి సమీపంలో తవాంగ్ ఉండగా...నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో చంబా ఉంది. అరుణాచల్ మాదే అనే మొండి వాదన చేస్తున్న చైనా...ఈ రెండు ప్రాంతాలనూ సొంతం చేసుకుంటే..దాదాపు విజయం సాధించినట్టే. కానీ...భారత్ మాత్రం చైనా కలను కలగానే మిగిల్చే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది.


Also Read: India China Clash: చైనా సైన్యాన్ని తరిమికొట్టిన భారత జవాన్లు- ఇదిగో వీడియో!