India China Border Dispute: భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య ఎంతో కీలకమైన మైత్రి ఉందని, ఇది చెడిపోకుండా సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భారత్, చైనా మధ్య బంధం స్థిరంగా ఉండడం ప్రపంచానికి కూడా ముఖ్యమేనని వెల్లడించారు. అమెరికాకి చెందిన Newsweek మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరలో రెండు దేశాలూ ఈ వివాదాన్ని పక్కన పెట్టి శాంతియుతంగా ముందుకు వెళ్లేందుకు చొరవ చూపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2020లో లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాన్ని మరింత పెంచింది. అప్పటి నుంచి దాదాపు 18 రౌండ్లకి పైగా కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వివాదం సద్దుమణగలేదు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 


"చైనాతో మైత్రి అనేది భారత్‌కి చాలా కీలకం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నాను. రెండు దేశాల బంధం బలపడేలా చర్చలు జరగాల్సిన అవసరముంది. భారత్ చైనా మధ్య వివాదం సద్దుమణగడం కేవలం ఈ రెండు దేశాలకే కాదు. ప్రపంచం మొత్తానికి మంచిది. మిలిటరీ స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం చాలా ఉంది. వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించాలి"


- ప్రధాని నరేంద్ర మోదీ


భారత్‌ పాకిస్థాన్‌ బంధం గురించీ ప్రస్తావించారు ప్రధాని మోదీ. 2019లో జరిగిన పుల్వామా దాడి గురించి మాట్లాడారు. ఈ దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వైరం పెరిగింది. భారత్ ఎప్పుడూ శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటుందని తేల్చిచెప్పారు ప్రధాని మోదీ. హింస, ఉగ్రవాదానికి తమ దేశంలో తావు ఉండదని స్పష్టం చేశారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌ గురించి ప్రస్తావించేందుకు మోదీ ఆసక్తి చూపించలేదు. అది ఆ దేశ అంతర్గత వ్యవహారం అని వెల్లడించారు.