India Canada Tensions: 


భారత్‌తో మైత్రి అవసరమే: ట్రూడో 


భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు కెనడా ఇప్పటికీ సిద్ధంగానే ఉందని వెల్లడించారు. నిజ్జర్ హత్య విషయంలో తాము భారత్‌పై చేసిన ఆరోపణలు చేసినప్పటికీ ద్వైపాక్షిక బంధం విషయానికొచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తోందో గమనిస్తున్నామన్న ట్రూడో...భారత్‌తో మైత్రి కొనసాగించడం తమకు ఎంతో ముఖ్యమని తేల్చి చెప్పారు. ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన...ఈ వ్యాఖ్యలు చేశారు. 


"భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించడం మాకెంతో అవసరం. అంతర్జాతీయంగా భారత్ ఎలాంటి ప్రభావం చూపిస్తోందో గమనిస్తున్నాం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. జియోపొలిటికల్‌ పరంగా చూసినా ఆ దేశానిది కీలక పాత్ర. ఇండో పసిఫిక్ స్ట్రాటెజీలోనూ ఆ దేశం ముఖ్య పాత్ర పోషిస్తోంది. అందుకే భారత్‌తో బంధాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నాం. కానీ ఇదే సమయంలో కొన్ని విషయాల్లో భారత్‌ మాకు సహకరించాలి. మా న్యాయ వ్యవస్థను గౌరవించాలి. నిజ్జర్ హత్య విషయంలో ఏం జరిగిందో తేలాలంటే భారత్‌ సహకారం అవసరం"


- జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాన మంత్రి


అమెరికా మద్దతు..


భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్‌తో భేటీ అయ్యారు. ఈ విషయాన్నీ ప్రస్తావించారు ట్రూడో. ఈ భేటీలో నిజ్జర్ హత్య గురించి మాట్లాడతామని అమెరికా తమకు హామీ ఇచ్చినట్టు చెప్పారు. అమెరికా ప్రజలు తమ వెంటనే ఉన్నారని, తాము చేసే ఆరోపణల్లో నిజం ఉందని మళ్లీ అన్నారు ట్రూడో. 


"అమెరికా మాకు మద్దతుగా ఉంది. మేం చేసిన ఆరోపణలు ఎంత నిజముందో, అవి ఎంత కీలకమైనవో అగ్రరాజ్యానికి తెలుసు. ప్రజాస్వామ్య దేశాలన్నీ చట్టానికి లోబడి ఉండడం చాలా అవసరం. మేం అన్నీ ఆలోచించుకునే ముందుకు వెళ్తున్నాం"


- జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాన మంత్రి


అమెరికా, భారత్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరు వర్గాలు కూడా కెనడా,భారత్‌ల మధ్య దౌత్య వివాదాన్ని అసలు ప్రస్తావించలేదు. మిగతా అన్ని అంశాలపై చర్చ జరిగింది కానీ ఆ విషయంపై మాత్రం ఇరు దేశాలు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం సెప్టెంబర్ 28 మధ్యాహ్నం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌, భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు వివిధ రకాల అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు తీవ్రంగా భారత్‌, కెనడాల మధ్‌య నడుస్తున్న వివాదం గురించి మాత్రం ప్రస్తావించలేదు. భారత్‌, కెనడా రెండూ కూడా అమెరికాకు మిత్ర దేశాలే. అయితే ఖలిస్థానీ సానుభూతి పరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో కెనడా చేస్తున్న దర్యాప్తుకు భారత్‌ సహకరించాలని గతంలో అమెరికా కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ విషయం చర్చకు వస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. 


Also Read: PM Modi tour: ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌-వచ్చే వారం మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన