I.N.D.I.A. Bloc Rally in Delhi: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ని వ్యతిరేకిస్తూ I.N.D.I.A కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది. మార్చి 31వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ వద్ద ఆందోళనలు చేపట్టనుంది. ఇప్పటికే తమిళనాడులో DMK నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ నిరసనల్లో పాల్గొనేందుకు ముందుకొచ్చింది. అంతకు ముందే ఆప్‌లోని కీలక నేతలంతా ప్రతిపక్ష పార్టీలను సంప్రదించారు. కేజ్రీవాల్‌కి మద్దతుగా నిలబడాలని అడిగారు. ఈ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తోంది. ఇందులో భాగంగానే భారీ ర్యాలీ చేస్తామని ప్రకటించింది. ఇది ఎన్నికల కోసం చేస్తున్న ర్యాలీ కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కేజ్రీవాల్‌కి మద్దతుగా నిలబడుతున్నామని వెల్లడించింది. 


"మార్చి 31వ తేదీన ప్రతిపక్ష కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ కూటమిలోని కీలక నేతలంతా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇది ఎన్నికల కోసం చేస్తున్న ర్యాలీ కాదు. మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి మేం చేస్తున్న యుద్ధం"


- అర్విందర్ సింగ్ లవ్‌లీ, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ 






అటు ఢిల్లీ మంత్రి అతిషి కూడా ఈ ర్యాలీ గురించి ప్రస్తావించారు. మార్చి 31న జరిగే ఈ ఆందోళనకి మహా ర్యాలీ అనే పేరు పెట్టినట్టు చెప్పారు. ఇది కేజ్రీవాల్‌ని కాపాడేందుకు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోడానికి అని స్పష్టం చేశారు. 


"ప్రతిపక్షాలపై కావాలనే దాడి చేస్తున్నారు. దీనికి నిరసనగానే ప్రతిపక్ష కూటమి మార్చి 31వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం వద్ద మహా ర్యాలీ చేపడుతోంది. ఇది కేజ్రీవాల్‌ని కాపాడుకోడం కోసం కాదు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోడం కోసం"


- అతిషి, ఢిల్లీ మంత్రి 


 






అటు అరవింద్ కేజ్రీవాల్ తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ముందు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆయన ఆ తరవాత వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన అరెస్ట్ అక్రమం అని వెంటనే విడుదల చేయాలని అందులో ప్రస్తావించారు. ఓ అధికారి తనతో దురుసుగా ప్రవర్తించాడని ఇప్పటికే ఆరోపించారు కేజ్రీవాల్. త్వరలోనే తాను బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.