ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చాన్నాళ్లుగా ఆయన వైసీపీకి దూరంగా ఉన్నారు. తాజా ఎన్నికల్లోనూ వరప్రసాద్ కి టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు వరప్రసాద్. 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరుసగా రెండుసార్లు ఆయనకు అవకాశం ఇచ్చిన జగన్, మూడోసారి మాత్రం హ్యాండిచ్చారు. దీంతో వరప్రసాద్ తనదారి తాను చూసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ నేరుగా ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరారు. 






బీజేపీ తరపున తిరుపతి లోక్ సభకు వరప్రసాద్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వదిలేసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు ఇటీవల ప్రకటించిన జాబితాలో కూడా తిరుపతిని పక్కనపెట్టారు. దీంతో ఆ నియోజకవర్గంలో బీజేపీ తరపున వరప్రసాద్ పోటీ చేస్తారనే వాదన బలపడుతోంది. తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 2019 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ గురుమూర్తి 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వరప్రసాద్ బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయి. 


గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్, వాస్తవానికి మంత్రి పదవి ఆశించారు. ఎస్సీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారాయన. కానీ తొలి దఫా జిల్లాకు చెందిన గౌతమ్ రెడ్డికి, అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవులిచ్చారు జగన్, గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కానీ, మంత్రి పదవి ఇవ్వలేదు. రెండో దఫా జిల్లాకు చెందిన కాకాణి గోవర్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఎస్సీ కోటాలో నెల్లూరు జిల్లాకు మంత్రి పదవి లేదు. దీంతో వరప్రసాద్ అసంతృప్తికి లోనయ్యారు. ఆయనకు టికెట్ లేదనే విషయం చాన్నాళ్లకు ముందే క్లారిటీ వచ్చింది. దాదాపు అధిష్టానం ఆయన్ను పట్టించుకోవట్లేదు. గూడురులో వైసీపీ తరపున ఎమ్మెల్యే మేరిగ మురళికి జగన్ అవకాశమిచ్చారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ గూడూరులో పోటీ చేయబోతున్నారు. ఇక వరప్రసాద్ కి తిరుపకి ఎంపీసీటు మాత్రమే ఖాళీగా ఉంది. మరి ఆ సీటు వరప్రసాద్ కి ఇస్తారో లేదో తేలాల్సి ఉంది. 


ప్రస్తుతం బీజేపీలో చేరిన వరప్రసాద్ కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కూడా కలిశారు. జనసేన తరపున గూడూరు టికెట్ ఆశించారు. కానీ పొత్తుల్లో అది టీడీపీకి వెళ్తుందని వరప్రసాగ్ కి తేల్చి చెప్పారు జనసేనాని. ఆ తర్వాత ఆయన మెల్లగా బీజేపీకి దగ్గరయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. తనకు తిరుపతి లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశమివ్వాలని కోరారు. ఆ స్థానానికి బీజేపీకి కూడా బలమైన అభ్యర్థి ఎవరూ లేరు. దీంతో వారు కూడా వరప్రసాద్ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. 


ఎన్నికల వేళ ఏపీలో వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీవైపు రాగా.. కొందరు ఎమ్మెల్యేలు జనసేనకు దగ్గరయ్యారు. చివర్లో ఇప్పుడు బీజేపీ కూడా ఓ ఎమ్మెల్యేని తనవైపు తిప్పుకోవడం విశేషం.