India and Pakistan have officially announced that they have agreed to a ceasefire :  భారత్, పాకిస్తాన్  కాల్పులు విరమణ ఒప్పంద చేసుకున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయాన్ని, భారత్ పాక్ అధికారికంగా చెప్పకపోవడంతో చాలా మంది నమ్మలేదు. కానీ ట్రంప్ ఈ ట్వీట్ చేసిన కాసేపటికే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాము కాల్పుల విరమణకు అంగీకరించామని ట్వీట్ చేశారు.  

ఇషాక్ దార్ ట్వీట్ చేసిన కాసేపటి తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి మీడియా ముందుకు వచ్చారు.  ఉద్రిక్తతలు ప్రారంభమైన తరవాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నర్ సోఫియా ఖురేషితో కలిసి అప్ డేట్స్ చెప్పిన మిస్త్రి ఈ సారి మాత్రం ఒక్కరే వచ్చారు. నేరుగా ప్రకటన చేసి వెళ్లిపోయారు. కాల్పుల విరమణ కు అంగీకరించామని స్పష్టంగా ప్రకటించారు.  

అయితే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగినట్లుగా మిస్త్రీ చెప్పలేదు.  పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేశారని  కాల్పుల విరమణ గురించి  ప్రతిపాదించారని అన్నారు.  పాకిస్తాన్ డీజీఎంఓ ఈరోజు మధ్యాహ్నం 15:35 గంటలకు భారత డీజీఎంఓకు ఫోన్ చేశారని..   భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల నుండి భూమి, వాయు, సముద్రంపై కాల్పులు, సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేస్తాయని వారు అంగీకరించారని తెలిపారు.  ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయని తెలిపారు.  మే 12న మధ్యాహ్నం 12 గంటలకు వారు మళ్ళీ  చర్చించుకుంటారని తెలిపారు.  భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కాల్పులు , సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం రెండు దేశాల మధ్య నేరుగా తీసుకోబడిందని మిస్త్రీ స్పష్టం చేశారు.  మరే ఇతర అంశంపై మరే ఇతర ప్రదేశంలో చర్చలు జరపలేదన్నారు. 

కాల్పల విరమణ క్రెడిట్ ను భారత్.. కానీ పాకిస్తాన్ కానీ అమెరికాకు ఇవ్వలేదు. రెండు దేశాల మధ్య జరిగిన చర్చలతోనే ఈ నిర్ణయం జరిగిందని ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని ట్రంప్ ముందుగా ప్రకటించుకున్నారు. తామే దౌత్యం చేశామని కూడా చెప్పుకున్నారు. అందులో నిజమెంతో ట్రంప్ కే తెలియాలి.