కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కాకుండా స్కాంగ్రెస్ కొనసాగుతోందని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కరెంట్ కొరత కాంగ్రెస్ ప్రభుత్వమే సృష్టించిందని ఆరోపించారు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్రికెట్ మ్యాచ్ చూడటాన్ని కుమారస్వామి తప్పుపట్టారు. " రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడు. ఇక్కడ ప్రజలు సమస్యల్లో ఉంటే కర్ణాటక నీరో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు" అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లపై విమర్శలు గుప్పించారు. సీఎం, డిప్యూటీ సీఎం కొందరు సహచరులతో కలిసి బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. దీనిపై కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ప్రభుత్వం మాత్రమ క్రికెట్ మ్యాచులు చూస్తోందని ఆరోపించారు.


ఈ మ్యాచ్‌లో మీరు పాకిస్తాన్‌కి మద్దతు ఇచ్చారా..? లేక ఆస్ట్రేలియాకు మద్దతు ఇచ్చారా..? అని సెటైర్లు వేశారు. ప్రజలు ప్రభుత్వంలో అవినీతి గురించి మాట్లాడుతుకుంటున్నారని అన్నారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. పర్సంటేజీలు, అవినీతిపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మేం చెప్పినట్లు చేశామని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని కుమారస్వామి అన్నారు.


రాష్ట్రప్రభుత్వం, కేంద్రం సహాయం కోసం లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేంద్రాన్ని కలవాలని ప్రభుత్వానికి సూచించారు. కొన్ని జిల్లాల్లో నీటి కొరత ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇరు పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వంపై కుమారస్వామి విరుచుకుపడ్డారు.


కర్ణాటక రాష్ట్రం విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తీరిగ్గా కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూడడంలో మునిగిపోయారని దుయ్యబట్టారు. కరెంటు కొరతను ప్రభుత్వమే సృష్టించిందని ఆరోపించారు. కమిషన్ల కోసమే కరెంటును బయటనుంచి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 32, 912 మెగావాట్లను ఉత్పత్తి చేసే వ్యవస్థ ఉన్నప్పటికీ నిర్వహణలోపం కారణంగా కేవలం 12 వేల మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ లోటుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే మ్యాచ్ ను వీక్షించడంపై వచ్చిన విమర్శలను ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఖండించారు. జీవితం అంటే రాజకీయం కాదని అన్నారు. 


అనంతరం కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల గురించి అధికార కాంగ్రెస్ ప్రకటించుకోవడంలేదని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జెడిఎస్ కదా ముగిసి పోయిందన్న భ్రమలో కాంగ్రెస్ వెళ్లిందని వ్యాఖ్యానించారు.  కర్ణాటకలో 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని విమర్శించారు. ఇకనైనా రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలను పరిష్కరించడానికే ఓటు వేసి గెలిపించాలి తప్ప ఇలా కాలయాపన చేయడానికి కాదని నొక్కి చెప్పారు.