Himachal Brothers Marry Same Woman: ఓ మహిళ ఇద్దరు భర్తలను కలిగి ఉండటం అంటే సమాజం అదో రకంగా చూస్తుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఇది సంప్రదాయం. ఇలాంటి సంప్రదాయం కలిగిన ఓ తెగలోని అమ్మాయి.. ఒకే పెళ్లి వేడులో ఇద్దరు అన్నదమ్ములను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఇప్పుడు వైరల్ గా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో షిల్లై గ్రామానికి చెందిన ప్రదీప్ నేగి , కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులు, సమీపంలోని కున్హత్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం హట్టీ తెగలోని బహుభర్తృత్వ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సంప్రదాయాన్ని "జోడిదరన్" లేదా "ద్రౌపది ప్రథ" అని పిలుస్తారు. ఈ సంప్రదాయంలో ఒక మహిళను ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరుల్ని వివాహం చేసుకోవచ్చు. ఈ వివాహం జూలై 12-14 మధ్యలో మూడు రోజుల పాటు జరిగింది.
ఈ వివాహం పూర్తి సమ్మతితో జరగిందని సునీతా చౌహాన్ తన నిర్ణయం స్వచ్ఛందంగా తీసుకున్నానని చెప్పారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఈ సంప్రదాయాన్ని అంగీకరించినట్లు తెలిపింది. ఈ రోజుల్లో ఇలాంటి పెళ్లిళ్లను సంప్రదాయం పేరుతో చేసుకుంటున్నారు...వీరు సమాజానికి దూరంగా బతుకుతూ.. చదువులేని వారు అని ఎవరైనా అనుకుంటారు..కానీ వారు ఉన్నత విద్యావంతులు. ప్రదీప్ నేగి జల్ శక్తి విభాగంలో ఉద్యోగి, కపిల్ నేగి విదేశాల్లో హాస్పిటాలిటీ రంగంలో పనిచేస్తున్నాడు. వారు భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ, ఈ వివాహం ద్వారా కుటుంబ ఐక్యత, సంప్రదాయాన్ని కాపాడుకున్నామని చెబుతున్నారు.
హట్టీ సముదాయంలో బహుభర్తృత్వం శతాబ్దాలుగా సంప్రదాయంగా ఉంది. ఇది భూమి విభజనను నివారించడానికి, కుటుంబ ఐక్యతను కాపాడటానికి , సామాజిక భద్రతను అందించడానికి అవసరమని వారు భావిస్తారు. ఈ సంప్రదాయం మహాభారతంలోని ద్రౌపది పాత్రతో సంబంధం కలిగి ఉందని, ఆమె ఐదుగురు పాండవులను వివాహం చేసుకున్నట్లు చెబుతారు సంప్రదాయం ట్రాన్స్-గిరి ప్రాంతంలో, ముఖ్యంగా సిర్మౌర్, కిన్నౌర్, కుల్లూ, లాహౌల్-స్పితి ప్రాంతాలలో సాధారణం. ఇది ఆర్థిక కారణాలైన భూమి విభజన నివారణ , కుటుంబ బాధ్యతల భాగస్వామ్యం కోసం ఈ ప్రాంతాల్లోని కుటుంబాలు తప్పనిసరిగా పాటిస్తాయి.
షిల్లై గ్రామంలో దాదాపు 36 కుటుంబాలు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నాయి. అయితే ఆధునికీకరణ, విద్య, ఉద్యోగ అవకాశాలు, చట్టపరమైన నిబంధనల కారణంగా బహుభర్తృత్వం తగ్గుముఖం పడుతోంది. భారతదేశంలో బహుభర్తృత్వం చట్టవిరుద్ధం అయినప్పటికీ, ఈ ప్రాంతంలో సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉంది. ప్రభుత్వం ఈ ఆచారాన్ని పెద్దగా పట్టించుకోదు. కానీ యువతలో ఈ సంప్రదాయం పట్ల ఆసక్తి తగ్గుతోంది.