Imran Khan Arrest:
ఇమ్రాన్ ఇంట్లోకి పోలీసులు..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి పోలీసులు దూసుకెళ్లారు. ఇమ్రాన్ ఇస్లామాబాద్‌లోని కోర్టుకు వెళ్లే దారిలో ఉండగానే పోలీసులు ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. ఇది జరిగిన సమయంలో ఇంట్లో ఆయన సతీమణి బుశ్రా బేగం ఉన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇమ్రాన్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
"పంజాబ్ పోలీసులు మా ఇంటిపై దాడి చేశారు. నా భార్య ఒంటరిగా ఉన్న సమయంలో లోపలకు చొచ్చుకెళ్లారు. ఏ చట్ట ప్రకారం ఇలా చేస్తున్నారు..? ఇదంతా కచ్చితంగా లండన్ ప్లాన్‌లో భాగమే. నవాజ్ షరీఫ్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కుట్ర జరుగుతోంది"
- ఇమ్రాన్ ఖాన్, పాక్ మాజీ ప్రధాని
పోలీసులు PTI కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. చాలా రోజులుగా ఇమ్రాన్ మద్దతు దారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. అందుకే ఇమ్రాన్ కోర్టుకు వెళ్లలేదు. ఇస్లామాబాద్ యంత్రాంగం..శుక్రవారం రాత్రి 144సెక్షన్ అమలు చేసింది. ఎవరూ గుమిగూడకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆయుధాలు పట్టుకుని తిరగొద్దని హెచ్చరించింది. డ్రైవింగ్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లు తప్పనిసరిగా దగ్గరుంచుకోవాలని తేల్చి చెప్పింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే తన అరెస్ట్‌ను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఇదంతా "లండన్ ప్లాన్"లో భాగంగానే జరుగుతోందని ఆరోపించారు. ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. నవాజ్ షరీఫ్‌పై ఉన్న కేసులన్నింటినీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
"ఇదంతా లండన్ ప్లాన్‌లో భాగమే. నన్ను అరెస్ట్ చేసి, జైల్లో పెట్టాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. నవాజ్ షరీఫ్ అలా భరోసా ఇచ్చారు. మా పార్టీని పూర్తిగా పతనమయ్యేలా చేయడమే కాకుండా ఆయనపై ఉన్న కేసులను రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు"
-ఇమ్రాన్ ఖాన్, పాక్ మాజీ ప్రధాని
గల్ఫ్ దేశాలు గిఫ్ట్ ఇచ్చిన కాస్ట్‌లీ వాచ్‌లను అమ్మేసి పెద్ద మొత్తంలో సంపాదించారని ఇమ్రాన్‌పై ఆరోపణలొచ్చాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి బదులు ఇవ్వకపోవడం వల్ల పాక్ ఎన్నికల సంఘం ఇమ్రాన్‌పై అనర్హతా వేటు వేసింది. 2022లో ఉన్నట్టుండి ఆయన తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిదే కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.