నిద్ర సరిపోకపోవడం, ఎక్కువసేపు స్క్రీన్ చూడడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, విశ్రాంతి తక్కువగా తీసుకోవడం వంటి వాటివల్ల తరచూ తలనొప్పులు వచ్చి వేధిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆకస్మికంగా వచ్చే తలనొప్పి తట్టుకోవడం కష్టం. వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే దీర్ఘకాలికంగా చెడు ప్రభావాలు కనిపించవచ్చు. ఇలా తరచూ తలనొప్పి వచ్చి పోతూ ఉంటే ఇంట్లో దొరికే మసాలాలతో ఉపశమనం పొందవచ్చు.


దాల్చిన చెక్క 
ఈ మసాలాను మనం రోజువారీ వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాము. మీరు తాగే టీలో, లేదా పానీయాల్లో దాల్చిన చెక్క పొడిని వేసుకొని తాగండి. దీనివల్ల తలనొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క పొడిని కాస్త నీటిలో కలిపి లేదా గంధంలో కలిపి నుదుటిపై రాయడం వల్ల కూడా తలనొప్పి తగ్గే అవకాశం ఉంది. ఈ మసాలాలో శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలం. దీని నుంచి వచ్చే వాసన నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. తద్వారా తలనొప్పిని తగ్గిస్తుంది. దాల్చిన చెక్క పేస్టును నుదుటిపై రాసుకొని అరగంట పాటు నిద్రపోవాలి. తర్వాత లేచాక గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది.


అల్లం 
ప్రతి ఇంట్లో అల్లం ముక్క ఉండడం సాధారణం. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో ఇది నింది ఉంటుంది. తరచూ తలనొప్పి బారిన పడేవారు అలాంటివి తాగడం అలవాటుగా మార్చుకోవాలి, లేదా అల్లం రసాన్ని ఒక స్పూన్లో వేసి తాగినా తలనొప్పి తగ్గుతుంది. గోరువెచ్చని అల్లం టీని మెల్లగా సిప్ చేస్తూ తాగడం వల్ల తలనొప్పి కలిగించే రక్తనాళాల్లో ఉపశమనం కలుగుతుంది. జలుబు లేదా జ్వరంతో పాటు తలనొప్పి వచ్చినప్పుడు వేడి నీటిలో అల్లం రసం, నిమ్మరసం, ఎండుమిర్చి కూడా వేసి ఆవిరి పడితే సమస్య తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు ముక్కు మూసుకుపోయినప్పుడు కూడా నాసిక మార్గాన్ని ఓపెన్ చేయడంలో అల్లం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.  


లవంగాలు
నాన్‌వెజ్ వంటలకు మంచి రుచిని ఇవ్వడంలో లవంగాలు ముందుంటాయి. లవంగాలు లేని బిర్యానీని ఊహించలేం. ఈ సాధారణ వంట మసాలా కూడా తలనొప్పిని నయం చేయడంలో సాయపడుతుంది. పుదీనా ఆకులు, లవంగాలు కలిపి దీన్ని తయారుచేసుకుని తాగితే ఎంతో మంచిది. దీనికి కష్టపడాల్సిందేమీ లేదు. నీళ్ళల్లో లవంగాలు, పుదీనా ఆకులు వేసి మరగ కాచాలి. వాటిని వడగట్టుకుని ఆ నీటిని తాగేయాలి. ఇదే లవంగం టీ. లవంగాలు, పుదీనా ఆకులను పేస్టులా చేసుకుని తలపై రాసుకుంటే రక్తనాళాల్లో మంట తగ్గుతుంది. తద్వారా నొప్పి తగ్గుతుంది.  జలుబు, దగ్గు వల్ల కూడా ఒక్కోసారి తలనొప్పి వస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు లవంగాల నుంచి వచ్చిన వాసనను పీల్చడం వల్ల కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. 


Also read: కుండ దోశెను చూశారా, ఎలా తినాలని మాత్రం అడగవద్దు
















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.