IMD Alert: దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే చలితో వణికిపోతున్న జనాలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. పొగమంచు కప్పేసి కాలుష్యం మరింత ఎక్కువ అయ్యే సూచనలు ఉన్నట్టు ఐఎండీ హెచ్చరికలు చేస్తోంది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది.
రోగులు జాగ్రత్త
దేశంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. పొగమంచు కమ్మేస్తోంది. ఫలితంగా కాలుష్యం తీవ్రమవుతోంది. ఉదయం పది గంటలు దాటుతున్నా సూరీడు కనిపించడం లేదు. అసలు తెల్లారిందో లేదో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వాతావరణం జనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జలుపు, జ్వరాలు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రిల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు కరోనా హడలెత్తిస్తోంది.
రెండు రోజులు అప్రమత్తత అవసరం
శుక్రవారం, శనివారం మరింత అప్రమతంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది. పొగమంచు ఎక్కువ కురిసే అవకాశం ఉందని చెబుతోంది. ఉత్తరాదిలో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండబోతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. అవి మరింత డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. కాలుష్య తీవ్ర కూడా అమాంతం పెరుగుతోంది. అందుకే అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతవరణ శాఖ.
విమాన ప్రయాణికుల ఇక్కట్లు
పొగమంచు, పడిపోతున్న ఉష్ణోగ్రతలు దేశ ప్రజలపై రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత వారం రోజులుగా విమానాలు రద్దు చేస్తున్నారు. టేకాఫ్ అయిన విమానాలు దిగేందుకు వీలు లేక వేరువేరు ప్రాంతాల్లో తిప్పాల్సి వస్తోంది. విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వాతావరణ సహకరించకపోవడంతో చాలా విమానాలు రైట్ టైంకి టేకాఫ్ కావడం లేదు.
రైల్వేలకు రెడ్ సిగ్నల్
రైల్వే వ్యవస్థపై కూడా పొగమంచు ప్రభావంచూపిస్తోంది. చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీని కారణంగా స్టేషన్‌లలో జనాలు చలికి వణికిపోతూ వెయిట్ చేస్తున్నారు. రోడ్డు రవాణా వ్యవస్థ చాలా వరకు అస్తవ్యస్థమవుతోంది. చాలా వరకు ఉదయం పూట వాహనాలు తిరగడం లేదు. తిరిగినప్పటికీ ప్రమాదాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. పొగమంచు కారణంగా వాహనాలు నడపలేక రోడ్డు పక్కనే ఉంచలేక డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ రెండు రోజులు కూడా వాహనదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. పగటి పూట కూడా హెడ్‌లైట్స్ వేసుకొని వెహికల్స్ నడపాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో వెదర్
తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి వీస్తున్న బలమైన గాలుల కారణంగా తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పగటి పూట కూడా చలిగాలులు వణికిస్తున్నాయి. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం పొగమంచు పరిస్థితులు ఎక్కువ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ వెదర్
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీయనున్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా.. రాయలసీమలో కూడా వర్షాలేమీ పడే అవకాశం లేదు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.