Bihar Nitish Kumar Row: లోక్‌సభ ఎన్నికల ముందు బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. మామూలుగా అయితే ఇంత ఆసక్తి ఉండకపోయేదేమో. NDAని ఢీకొట్టడానికి I.N.D.I.A కూటమి ఏర్పాటు చేయడానికి చొరవ చూపించిన నితీశ్ కుమార్..ఇప్పుడు అదే NDAలో చేరాలనుకుంటుండమే ఇంత ఆసక్తిని పెంచింది. అసలే మూడు రాష్ట్రాల్లో ఓటమి చవి చూసి డీలా పడిపోయి ఉన్న కాంగ్రెస్‌కి ఇది గట్టి దెబ్బ కొట్టనుంది. అధికారికంగా ఇంత వరకూ నితీశ్ కుమార్ (Nitish Kumar Rejoins NDA) ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ...NDAలో చేరడం ఇక లాంఛనమే అన్న సంకేతాలిస్తున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయట. అయితే...ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...నితీశ్ కుమార్ NDAలో చేరితే...ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారా..? లేదంటే మరెవరికైనా ఆ పదవి దక్కుతుందా అన్నదీ ఉత్కంఠ కలిగిస్తోంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారమైతే...బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, సుశీల్ మోదీకి డిప్యుటీ సీఎం చేస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు వర్గాలూ ఇప్పటికే చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ ఎన్నికల (Bihar Politics) ఫార్ములానీ చర్చించారట. అటు రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ కూడా నితీశ్ కుమార్ చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తలుపులు ఎప్పుడూ మూసి ఉంచవని, అవసరాన్ని బట్టి వాటిని తెరుస్తామని తేల్చి చెప్పారు. అంటే...నితీశ్ రావడానికి బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పారాయన. అందుకు తగ్గట్టుగానే బీజేపీ నేతలంతా ఒక్కొక్కరుగా ఢిల్లీ నుంచి పట్నాకి క్యూ కట్టారు. అప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయినట్టు ABP News సోర్సెస్ ద్వారా తెలిసింది.
ఫార్ములా పాతదేనా..?
ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే..కొత్త ప్రభుత్వం ఏర్పడితే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ ఫార్ములా ఎలా ఉంటుందనేదే. అయితే..2022లో NDA నుంచి నితీశ్ బయటకు రాకముందు ఏ ఫార్ములా అయితే ఫాలో అయ్యారో ఇప్పుడూ అదే కొనసాగుతుందని ABP News సోర్సెస్ వెల్లడించాయి. అయితే...లోక్‌సభ సీట్ల పరంగా చూస్తే మాత్రం JDU కాస్త సర్దుకుపోక తప్పదేమో అనిపిస్తోంది. ఎందుకంటే..ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం...జేడీయూ 12-15 సీట్లలో పోటీ చేసేలా బీజేపీ ప్రతిపాదిస్తోంది. అంటే అంతకు మించి ఎక్కువ స్థానాలు దక్కకపోవచ్చు. ఇక కేబినెట్‌లో బీజేపీ నేతలకూ ప్రాధాన్యత దక్కనుంది. అంటే...కొందరిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రపోజల్స్ అన్నీ సిద్ధమైనట్టు సమాచారం. రెండు వైపుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ...బిహార్ బీజేపీ ఇన్‌ఛార్జ్ వినోద్ తవ్‌దే అమిత్‌షాతో ఇప్పటికే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత బిబార్ రాజకీయాల గురించి ఆయన వివరించారట. అయితే...మీడియా ముందు మాట్లాడడానికి మాత్రం ఆయన ఇష్ట పడడం లేదు. అంతా హైకమాండ్ చూసుకుంటుందని దాటవేస్తున్నారు. జేడీయూ పొత్తు విషయంలో చాలా ఆతృతగా ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.