ICICI Bank Videocon Loan Case:
మూడు రోజుల పాటు కస్టడీలో..
ICICI మాజీ సీఈవో, ఎండీ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఆర్థిక మోసాలు, రుణాలు మంజూరు చేయడంలో అవకతవకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరినీ డిసెంబర్ 26వ తేదీ వరకూ CBI తన కస్టడీలోనే ఉంచనుంది. ఈ ఆరోపణలకు సంబంధించి ఇద్దరినీ ప్రశ్నించిన సీబీఐ అధికారులు...శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో ఇద్దరూ తమ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదని, సరిగా కో ఆపరేట్ చేయలేదని చెబుతోంది CBI. అందుకే పోలీస్ కస్టడీలో ఉంచాలని స్పెషల్ సీబీఐ కోర్టుని కోరారు అధికారులు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ తరపున న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం...వీడియోకాన్‌కు లోన్ ఇవ్వడం వల్ల ICIC బ్యాంక్‌కు రూ.1,730 కోట్లు నష్టం వాటిల్లింది. చందాకొచ్చర్ సీఈవో అయిన తరవాత వీడియోకాన్‌కు చెందిన ఆరు సంస్థలకు రుణాలు ఇచ్చారు. చందాకొచ్చర్ సభ్యురాలిగా ఉన్న కమిటీ ఆధ్వర్యంలోనే ఈ రుణాలు అందాయి.
అంతే కాదు. వీడియోకాన్‌కు చెందిన సంస్థలకు రుణాలు ఇవ్వాలని మిగతా కమిటీలపైనా ఒత్తిడి తీసుకొచ్చారు చందా కొచ్చర్. ఇక సీబీఐ కౌన్సిల్ చెప్పిన వివరాల ప్రకారం...2009లో వీడియోకాన్ గ్రూప్ చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన కంపెనీ Nupower Renewablesకి రూ.64 కోట్ల లోన్ ఇచ్చింది. ముంబయిలో చందాకొచ్చర్ ఉంటున్న ఫ్లాట్‌ను దీపక్ కొచ్చర్ ఫ్యామిలీ ట్రస్ట్‌కు ఇచ్చేశారు. ఈ ఫ్లాట్ విలువ 1996లోనే రూ.5.25కోట్లు. కానీ...2016లో దీన్ని కేవలం రూ.11 లక్షలకు అమ్మేశారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే...సీబీఐ కౌన్సిల్ కోర్టుకు ఓ విజ్ఞప్తి చేసింది. Criminal Breach of Trust (IPC 409)సెక్షన్‌నూ ఈ కేసులో చేర్చాలని కోరింది.
ఛార్జ్‌షీట్‌లో ఇద్దరి పేర్లు..!
శుక్రవారం ఈ కేసు విచారణలో భాగంగా చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్‌ను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. విచారణ మొదలైన కాసేపటికే ఇద్దరినీ అరెస్ట్ చేశారు. సమాధానాలు సరిగా చెప్పడం లేదన్న కారణంగా వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే..ఈకేసులో త్వరలోనే సీబీఐ ఛార్జ్‌షీట్ ఫైల్ చేయనుంది. వేణుగోపాల్ దూత్, వీడియోకాన్ గ్రూప్‌తో పాటు చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్ పేర్లనూ ఈ ఛార్జ్‌షీట్‌లో చేర్చనున్నారు. కేవలం వీడియోకాన్ గ్రూప్‌ను ప్రమోట్ చేసేందుకు...గుడ్డిగా రుణాలు ఇచ్చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇందుకు బదులుగా దీపక్ కొచ్చర్ కంపెనీలో వీడియోకాన్ గ్రూప్ కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని చెప్పింది. 2012లో ICICI బ్యాంక్ వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు ఇచ్చింది. అది చివరకు నిరర్థక ఆస్తిగా మిగిలిపోయింది. 2018లో చందాకొచ్చర్‌పై ఆరోపణలు వచ్చాయి. రుణాలివ్వడంలో అవకతవకలకు పాల్పడ్డారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఫలితంగా...వెంటనే ఆమె సీఈవో, ఎండీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2020 సెప్టెంబర్‌లో దీపక్ కొచ్చర్‌ను అరెస్ట్ చేశారు.