Amrapali Kata became a key Oficer  in the Revanth government  :  తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు సీనియర్ అధికారుల కన్నా ఎక్కువ పవర్ ఫుల్‌గా ఉన్న ఆఫీసర్ కాట అమ్రపాలి. తాజా బదిలీల్లో ఆమెను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా కూడా నియమించారు. ఇప్పటికే ఆమె  జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్,  మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్,  HGCL మేనేజింగ్ డైరెక్టర్ , హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్ గా కూడా ఉన్నారు. ఆయా పోస్టుల్లో కొత్తగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వకపోవడంతో కీలక బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని అనుకోవచ్చు.


2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి                  


కాట అమ్రపాలి  2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. శాఖపట్నంలో జన్మించిన కాట ఆమ్రపాలి..  చెన్నై ఐఐటీ నుంచి బీటెక్, బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం 2010 యూపీఎస్‌లో ఆలిండియా 39వ ర్యాంక్‌ సాధించి ఐఏఎస్ అయ్యారు. ఈ కారణంగా సొంత రాష్ట్ర క్యాడర్‌నే కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆమెను తెలంగాణ  క్యాడర్‌కు కేటాయించారు. 2013లో వికారాబాద్ సబ్-కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంలో కొన్నాళ్లు వరంగల్ కలెక్టర్ గా వ్యవహరించారు. 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆమ్రపాలి, కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యూటీషన్ వెళ్లారు. తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు.


మొదట తెలంగాణ క్యాడర్ - తర్వాత కేంద్ర సర్వీసుల్లో !               


మొదట కేంద్ర హోం శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డికి ప్రైవేట్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించిన ఆమ్రపాలి, ప్రధాని డిప్యూటీ సెక్రెటరీగా పదోన్నతి పొందారు. పనిలో ఎప్పుడూ  అత్యంత సమర్థవంతం ఆఫీసరుగా పేరు తెచ్చుకున్నారు. 2020 సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా  నియమితులయ్యారు. అప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే వరకూ కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత మళ్లీ ఆమె తెలంగాణ రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. తెలంగాణ క్యాడర్ కు వచ్చినప్పటి నుంచి అమ్రపాలికి కీలక పోస్టులు దక్కుతున్నాయి.


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ క్యాడర్ లోకి !                            


గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో  ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్  కీలకంగా ఉండేవారు. కలెక్టర్ గా ఆమె పనితీరును మెచ్చిన కేసీఆర్   సీఎం సెక్రెటరీగా నియమించుకున్నారు. దీనితోపాటు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆమెకు ప్రాధాన్యం తగ్గింది. కాట అమ్రపాలి ప్రాధాన్యం పెరిగింది.