Telangana Traffic Challans: తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయడానికి జనాలు ఎగబడుతున్న సంగతి తెలిసిందే. పెండింగ్ చలాన్లను వసూలు చేసే ఉద్దేశంతో వాటిపై రాయితీ ఇస్తామని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. అందుకు తగ్గట్లే జీవో కూడా విడుదల చేశారు. డిసెంబర్ 26 నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తిస్తుందని జీవోలో చెప్పారు. కొంత మంది డిసెంబర్ 26 తర్వాత కొత్తగా పడ్డ ట్రాఫిక్ చలాన్లకు కూడా ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వస్తుందని భావిస్తున్నారు. కానీ, డిసెంబర్ 26 తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ చలాన్ పడ్డ వారికి ఈ రాయితీ వర్తించబోదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రభుత్వ జీవో ప్రకారం డిసెంబరు 25కు ముందు పడ్డ చలాన్లకు మాత్రం నిర్దేశిత డిస్కౌంట్ వర్తించనుంది.
రూ.10 కోట్ల వసూలు
పెండింగ్ చలానాలు వసూలు చేసుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ, రవాణా శాఖ కలిసి డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పెండింగ్ చలానాలు భారీగా క్లియర్ అవుతున్నాయి. కోట్ల రూపాయాల్లో ప్రభుత్వానికి ఆదాయం వచ్చి పడుతోంది. ఇప్పటికే రూ.10 కోట్ల రూపాయల మేర వసూలు అయినట్టు సమాచారం. ఇలా ఈ చలాన్ వెబ్ సైట్ పై విపరీతంగా ఒత్తిడి పడుతుండడంతో అప్పుడప్పుడు సైట్ క్రాష్ కూడా అవుతోంది. చాలా మంది యూజర్లు ఈ చలాన్ వెబ్ సైట్ ఓపెన్ చేసి ట్రాఫిక్ చలానాలు క్లియర్ చేసే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దాదాపు పది లక్షల చలాన్లు క్లియర్
డిసెంబర్ 28వ తేదీ రాత్రి అంటే గురువారం రాత్రి 10:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.80 లక్షలకు పైగా చలాన్లు క్లియర్ అయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3.84 లక్షల చలాన్లకు రూ.2.90 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 2.2 లక్షల చలాన్లకు రూ.1.90 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 97వేల చలాన్లకు రూ.81 లక్షలు వాహనదారుల నుంచి వసూలు చేశారు. చలాన్ సైట్‌పై తాకిడి పెరగడంతో సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయి. దీన్ని బట్టి.. పెండింగ్ చలానాల పేమెంట్లు కట్టేందుకు ఎంత స్పందన వస్తుందో అర్థమవుతోంది.
టూవీలర్లు, త్రీ వీలర్లకు 80 శాతం, బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్‌కు 60 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లకు రాయితీ ఇవ్వడంతో.... దొరికిందే ఛాన్స్ అని... ఆలస్యం చేయకుండా చలానాలు కట్టేస్తున్నారు వాహనదారులు. గత ఏడాది కూడా పెండింగ్ చలానాల వసూళ్ల కోసం ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించారు. అప్పుడు కూడా పెండింగ్ చలాన్ల ద్వారా ఏకంగా 300 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా.. ఈ ఏడాది కూడా సుమారు 2 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉండటంతో.. మరోసారి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించారు. డిసెంబర్ 26ను ఈ ఆఫర్ ప్రారంభించారు. జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్‌తో పెండింగ్ చలానాలు కట్టే అవకాశాన్ని ట్రాఫిక్ పోలీసులు కల్పించారు.