ED Hyderabad Auctions Seized Hawker 800A Aircraft:    ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక సరికొత్త రికార్డును నమోదు చేసింది. హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం తాము ఒక మనీ లాండరింగ్ కేసులో భాగంగా జప్తు చేసిన  హాకర్ 800ఎ  లగ్జరీ ప్రైవేట్ విమానాన్ని జూలై 1  నాడు విజయవంతంగా ఈ-వేలం ద్వారా విక్రయించింది. ప్రభుత్వ రంగ సంస్థ  ఎమ్‌ఎస్‌టీసీ లిమిటెడ్  ద్వారా నిర్వహించిన ఈ అధికారిక వేలంలో ఈ విమానం రూ.3 కోట్ల విక్రయ ధరకు అమ్ముడుపోయింది. దేశంలో ఈడీ ఒక విమానాన్ని వేలం వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Continues below advertisement

ఈ వేలం వెనుక హైదరాబాద్‌ను కుదిపేసిన రూ.792 కోట్ల భారీ ఫాల్కన్/క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోంజీ స్కామ్ ఉంది. హైదరాబాద్ కేంద్రంగా నడిచే  క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ..  ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్  పేరుతో ఒక నకిలీ స్కీమ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అమాయక పెట్టుబడిదారుల నుండి భారీగా నిధులను సేకరించి, వారికి ఎవరూ ఊహించని స్థాయిలో అధిక వడ్డీలు, రాబడులు ఇస్తామని నమ్మబలికారు. కానీ, ఎలాంటి అసలైన వ్యాపారం చేయకుండా, కొత్తగా వచ్చే పెట్టుబడిదారుల సొమ్మును పాతవారికి ఇస్తూ చివరకు దాదాపు రూ.792 కోట్ల మేర సామాన్య ప్రజల సొమ్మును ముంచేశారు.  

ఈ స్కామ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి, కంపెనీ సీఎండీ అమర్‌దీప్ కుమార్.. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం  తనపై కేసు నమోదు చేయడానికంటే ముందే.. తాను 2024లో రూ.14 కోట్లకు  కొనుగోలు చేసిన ఇదే ప్రైవేట్ జెట్ విమానంలో దేశం దాటి విదేశాలకు పారిపోయాడు. పరారీలో ఉన్న అమర్‌దీప్ కుమార్ వాడిన ఈ విమానం తిరిగి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి  చేరుకున్న తరుణంలో.. మార్చి 7, 2025 నాడు ఈడీ అధికారులు దీనిని సీజ్ చేశారు. ఆ తర్వాత ఈ విమానాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అయితే, విమానాన్ని ఎక్కువ రోజులు అలాగే ఉంచితే సహజంగానే దాని విలువ పడిపోవడమే కాకుండా.. దాని పార్కింగ్, మెయింటెనెన్స్ కోసం ప్రతి నెలా లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఈ భారాన్ని నివారించేందుకు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్  రూల్ 4(2) కింద ప్రత్యేక అనుమతి కోరుతూ ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీని ఆశ్రయించింది. అందుకు కోర్టు అనుమతించడంతో ఈ వేలం ప్రక్రియ పూర్తయింది.

ఈ కేసులో ఈడీ అధికారులు కేవలం విమానాన్ని వేలం వేయడమే కాకుండా.. ఇప్పటికే అమర్‌దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్, ఫాల్కన్ ఇన్వాయిస్ సీఈవో ఆర్యన్ సింగ్ ఛాబ్రాలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కాగా, ఈ విమానాన్ని వేలంలో ఎవరు కొనుగోలు చేశారనే  కొనుగోలుదారుడి అధికారిక పేరును గోప్యత, భద్రతా కారణాల దృష్ట్యా ఈడీ ,  ఎమ్‌ఎస్‌టీసీ సంస్థలు బహిరంగంగా వెల్లడించలేదు. అయితే, ఈ వేలం ద్వారా వచ్చిన రూ.3 కోట్ల నగదును పీఎమ్‌ఎల్‌ఏ స్పెషల్ కోర్టు అనుమతితో.. ఫాల్కన్ స్కామ్‌లో సర్వస్వం కోల్పోయిన అసలైన, బాధితులైన ఇన్వెస్టర్లకు పరిహారంగా   పంపిణీ చేయనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.