Telangana New Corona Cases:  తెలంగాణలో జెన్ 1 వేరియంట్ తో కూడిన కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. గత 24 గంటల్లో 6 కొత్త కేసులు నమోదైనట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న 925 కరోనా పరీక్షలు చేసినట్లుగా హెల్త్ బులెటిన్ లో వివరించింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో ఈ వైరస్ నుంచి ఒకరు కోలుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19 మంది ఐసొలేషన్‌లో ఉండగా.. 54 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.


ఆందోళన చెందొద్దు - ఫీవర్ ఆస్పత్రి సూపరింటెంటెండ్
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని నగరంలోని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ వెల్లడించారు. అయితే, ఈ కేసుల గురించి, కొత్త రకం కరోనా వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. దీని నుంచి తప్పించుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. కొత్త వేరియంట్ రక్తపోటు (బీపీ), కిడ్నీ సంబంధిత జబ్బులు, ప్రెగ్నెంట్, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లకు జేఎన్.1 వైరస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. కొవిడ్‌ వైరస్‌ రూపాంతరం చెంది జేఎన్.1గా మారిందని, ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని డాక్టర్ శంకర్ వెల్లడించారు.


బుధవారం ఫీవర్‌ ఆసుపత్రిలో ఓపీకి వచ్చిన వారిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. అయితే, అది కొత్త వేరియంట్ అయిన జేఎన్‌.1 అవునా, కాదా? అనేది తేలాలని చెప్పారు. రిపోర్టులు తమకు గాంధీ ఆస్పత్రి నుంచి రావాలని అన్నారు. జేఎన్‌.1 వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందితే ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌, ఫీవర్‌ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి ప్రత్యేక పడకలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇప్పటికే దీనికి సంబంధించి తమకు మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి అందాయని అన్నారు. అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ప్రస్తుతం పండుగల సీజన్‌ కాబట్టి, ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ శంకర్ సూచించారు.