Sakshi Malik Quits:


WFI చీఫ్‌ ఎన్నిక..


Wrestling Federation of India (WFI)కి కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ కుమార్ ఎన్నికయ్యారు. అంతకు ముందు వరకూ బ్రిజ్ భూషణ్ సింగ్ ఈ పదవిలో ఉన్నారు. అయితే..ఆయనపై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దాదాపు ఏడాదిగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. విచారణ జరుగుతోంది. బ్రిజ్ భూషణ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ అప్పట్లో డిమాండ్ చేశారు. ఈలోగా WFIకి ఎన్నికలు జరిగాయి. ఎవరి పైన అయితే లైంగిక ఆరోపణలు వచ్చాయో ఇప్పుడదే వ్యక్తికి అత్యంత సన్నిహితుడైన సంజయ్ సింగ్‌ ప్రెసిడెంట్ అయ్యారు. దీనిపైనే రెజ్లర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంజయ్ సింగ్‌ని అధ్యక్షుడిగా తాను అంగీకరించలేనని స్పష్టం చేసిన సాక్షి మాలిక్..రెజ్లింగ్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈ సమయంలోనే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. 


"దాదాపు 40 రోజుల పాటు రోడ్లపైనే పడుకున్నాం. దేశ నలుమూలల నుంచి మా నిరసనలకు మద్దతు లభించింది. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ స్నేహితుడు సంజయ్ సింగ్ WFI చీఫ్‌గా ఎన్నికయ్యాడు. అందుకే నేను రెజ్లింగ్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నాను. పూర్తిగా రెజ్లింగ్‌ని వదిలేస్తున్నాను"


- సాక్షి మాలిక్, రెజ్లర్