Hurricane Ian: 


ఫ్లోరిడా, క్యూబాలో హరికేన్..


అమెరికాలోని ఫ్లోరిడాలో హరికేన్ ఇయాన్ (Hurricane Ian) బీభత్సం సృష్టిస్తోంది. ఈదురు గాలులు, భారీ వర్షాలతో అతలాకుతలమైంది. తీరప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. అటు క్యూబాలోనూ ఈ హరికేన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు నిలువ నీడ కోసం నిరీక్షిస్తున్నారు. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అక్కడి ప్రజలంతా చీకట్లనే ఉండాల్సి వస్తోంది. ఇటు అమెరికాలో...ఇప్పటి వరకూ వచ్చిన తుపాన్లలో ఇదే అతి పెద్దదని అంటున్నారు. ఈ తుపాను పరిస్థితులపై ఫ్లోరిడాలో ఓ రిపోర్టర్ వివరిస్తుండగా...ఒక్కసారిగా గాలి వేగంగా వీచింది.
ఆ ధాటికి తట్టుకోలేక రిపోర్టర్ కింద పడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడి తుఫాన్ ప్రభావాన్ని కళ్లకు కట్టిన విజువల్ ఇది. సాధారణంగా...తుఫాన్‌లను తీవ్రత ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తారు. ఫ్లోరిడాలోని తుఫాన్‌ని కేటగిరీ 4గా నిర్ధరించారు. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 18 లక్షల మంది చీకట్లోనే గడుపుతున్నారు. గాలుల వేగానికి ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. నిజానికి...ఫ్లోరిడాను తాకకముందే...క్యూబాలోనే తీవ్ర ప్రభావం చూపించింది Hurricane Ian.ఈ తుఫాను ధాటికి అక్కడ ఇద్దరు మృతి చెందారు. 11 లక్షల మంది చీకట్లో మగ్గిపోతున్నారు. ఫ్లోరిడాలోని ఓ తీరప్రాంతంలో ఓ పడవ మునిగి 20 మంది గల్లంతయ్యారని అమెరికా అధికారులు తెలిపారు. వారంతా క్యూబాకు చెందిన వాళ్లేనని వెల్లడించారు. 














అన్ని ఏర్పాట్లు..


ప్రజలకు సహకారం అందించేందుకు 300 ఆంబులెన్స్‌లను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. మెడికల్ టీమ్స్ కూడా రెడీ అయిపోయాయి. 37 లక్షల మందికి ఆహారం, 35లక్షల లీటర్ల తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఫ్లోరిడాను రీబిల్డ్ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు.