Clashes in PoK: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పౌరులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ గొడవల్లో ఓ పోలీస్‌ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. ద్రవ్యోల్బణం, అత్యధికంగా పన్ను వసూళ్లు చేయడం, విద్యుత్ కొరత లాంటి సమస్యలపై స్థానికులు పోరాడుతున్నారు. తమ హక్కుల్ని అణిచివేస్తున్నారంటూ ప్రజలు తిరగబడుతున్నారు. ఆజాదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. ముజఫర్‌బాద్‌లో పోలీసులు, భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతత్వంలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో ఆ కమిటీలోని నేతలు రోడ్లపైకి వచ్చి అల్లర్లకు దిగడం వల్ల పోలీసులు వాళ్లని అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పూర్తిస్థాయిలో బంద్ కొనసాగుతోంది. 


స్వతంత్ర హోాదా డిమాండ్..


పోలీసులకు వ్యతిరేకంగా కొందరు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అనవసరంగా పోలీసులు వచ్చి ఘర్షణకు దిగారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. మా హక్కుల కోసమే పోరాడుతున్నామని తేల్చి చెబుతున్నారు. అయితే..కొంత మంది పాకిస్థాన్‌ నుంచి తమకు స్వాతంత్య్రం కావాలంటూ నినదిస్తున్నారు. PoKకి స్వతంత్ర హోదా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజానికి గతేడాది ఆగస్టులోనూ PoKలో ఇదే తరహా ఆందోళనలు జరిగాయి. 


"కరెంట్ బిల్స్‌పైనా భారీ మొత్తంలో పన్నులు వేస్తున్నారు. దీనినే మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. హైడల్ పవర్‌ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌నే మాకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ధరలూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మాకు పాకిస్థాన్ నుంచి స్వతంత్ర హోదా కావాలి"


- ఆందోళనకారులు






ఇక్కడ భారత్‌లోనూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది. ఇది కచ్చితంగా భారత్‌దేనని తేల్చి చెబుతున్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. PoK ఎప్పటికీ భారత్‌లో భాగమే అని వెల్లడించారు. 


"పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భాగమే. అందుకు సంబంధించిన తీర్మానాలు భారత్ వద్ద ఉన్నాయి. ఆ ప్రాంతంపైన వేరే వాళ్ల ఆధిపత్యం ఏంటి..? ఇంట్లో పెద్ద వ్యక్తి సరైన విధంగా లేకపోతే ఎవరు పడితే వాళ్లు వచ్చి దొంగతనం చేస్తారు. ఆక్రమించేసుకుంటారు. గత పాలకులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గురించి ప్రజలు మర్చిపోయేలా చేశారు. ఇప్పుడిప్పుడే అందరికీ అవగాహన వస్తోంది"


- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి


Also Read: మా ఉనికి ప్రమాదంలో పడితే అణు బాంబులు తయారీ తప్పదు - ఇజ్రాయేల్‌కి ఇరాన్‌ వార్నింగ్