Narmada cruise tragedy: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో పర్యాటకుల విహారయాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది. బర్గి డ్యామ్ రిజర్వాయర్‌లో పర్యాటకులతో వెళ్తున్న క్రూయిజ్ బోట్ అకస్మాత్తుగా మునిగిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు తోడై ఈ ఘోర ప్రమాదానికి దారితీశాయని జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్ వెల్లడించిన ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.   మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా బర్గి డ్యామ్ రిజర్వాయర్‌లో పర్యాటకుల నవ్వులు మృత్యుఘోషగా మారాయి. ఆహ్లాదకరమైన విహారయాత్ర కోసం క్రూయిజ్ ఎక్కిన సుమారు 40 మంది పర్యాటకులు, అకస్మాత్తుగా వచ్చిన తుఫాను ధాటికి జలసమాధి అయ్యారు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో, ఒక తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని గట్టిగా హత్తుకుని మరణించిన దృశ్యం చూసి రెస్క్యూ టీమ్ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రాణభయంతో అల్లాడుతూ ఆ తల్లి చేసిన చివరి ప్రయత్నం మాతృత్వానికి నిదర్శనంగా మిగిలిపోయింది.

Continues below advertisement

 సెంటర్ ఆఫ్ గ్రావిటీ శాపమై 

ప్రమాదానికి అసలు కారణం బోటు బ్యాలెన్స్ తప్పడమేనని అధికారులు ప్రకటించారు.  గాలి తీవ్రత పెరగడంతో పై అంతస్తులో ఉన్న పర్యాటకులు భయాందోళనతో అటు ఇటు పరుగులు తీశారు. అందరూ ఒకేసారి ఒకవైపుకు చేరడంతో బోటు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోయి ఊగిసలాడటం మొదలైంది. ఈ క్రమంలో కింది భాగంలోకి నీరు చేరడంతో బోటు క్షణాల్లో మునిగిపోయింది. కింది అంతస్తులో ఉన్న వారు బయటకు వచ్చే అవకాశం లేక లోపలే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సురక్షితంగా ఒడ్డుకు చేరిన 28 మంది ప్రాణాలతో బయటపడ్డా, తమ కళ్లముందే ఆత్మీయులు మునిగిపోవడం చూసి కోలుకోలేకపోతున్నారు.

Continues below advertisement

 హెచ్చరికలు ఉన్నా నిర్లక్ష్యం ఎందుకు? 

ఈ ప్రమాదంలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి ఒకరోజు ముందే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ, పర్యాటక బోటుకు అనుమతి ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. 2006 నుంచి నడుస్తున్న ఈ సర్వీసులో ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం భద్రతా ప్రమాణాల డొల్లతనాన్ని బయటపెట్టింది. నిబంధనల ప్రకారం బోటు బలమైన గాలులను తట్టుకుంటుందని భావించినా, ప్రయాణికుల కదలికల వల్ల కలిగే అస్థిరతను అంచనా వేయడంలో సిబ్బంది విఫలమయ్యారు.   

 బాధ్యులపై కఠిన చర్యలు 

ఈ విషాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రూయిజ్ పైలట్ మహేష్ పటేల్, హెల్పర్ ,  టికెట్ కౌంటర్ ఇన్‌చార్జ్‌లను విధుల నుంచి తొలగించారు. దీనిపై ఉన్నత స్థాయి శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఒక చిన్నారి ప్రాణంతో సహా తొమ్మిది మందిని బలిగొన్న ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి విచారకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా క్రూయిజ్ ఆపరేషన్ల కోసం కఠినమైన  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల బ్యాలెన్సింగ్,  అత్యవసర రక్షణ చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురానున్నారు. కానీ, పోయిన ప్రాణాలను ఏ నిబంధనలు తిరిగి తీసుకురాలేవు. జబల్‌పూర్ జలాల్లో కలిసిన ఆ చిన్నారి నవ్వులు, ఆ తల్లి త్యాగం వ్యవస్థలోని లోపాలకు నిరంతర హెచ్చరికగా మిగిలిపోతాయి.