India-born engineer Noshir Gowadia: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లతో దాడులు చేసింది. గబ్బిలం ఆకారంలో ఉండే ఈ బాంబర్ల గురించి.. వాటిగొప్పతనం గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రపంచంలో మరే దేశం వద్ద లేని B-2 స్పిరిట్ స్టెల్త్  బాంబర్ల తయారీలో ఓ భారత ఇంజినీర్ కీలకంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు.   

Continues below advertisement


B-2 స్పిరిట్ స్టెల్త్  బాంబర్ల తయారీలో కీలక వ్యక్తి నోషిర్ గోవాడియా


నోషిర్ గోవాడియా 1944 ఏప్రిల్ 11న ముంబైలో ఒక పార్సీ కుటుంబంలో జన్మించాడు.  15 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ సమానమైన అర్హత సాధించిన ప్రతిభావంతుడైన ఇంజనీర్. 1963లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి అమెరికాకు  వెళ్లాడు .  1969లో అమెరికన్ పౌరసత్వం పొందాడు. 1968 నుండి 1986 వరకు  నార్త్‌రాప్ గ్రుమ్మన్ కార్పొరేషన్ లో ఇంజనీర్‌గా పనిచేశాడు.  ఇక్కడ B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్  ప్రొపల్షన్ సిస్టమ్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిస్టమ్ బాంబర్‌ను రాడార్ ,  హీట్-సీకింగ్ మిసైళ్ల నుండి రక్షించే స్టెల్త్ సాంకేతికతను అభివృద్ధి చేశాడు. 


డబ్బు కోసం రహస్య సమాచారం అమ్మేసిన గోవాడియా  
 
అయితే హఠాత్తుగా ఆయనను చైనా గూఢచారి అని చెప్పి అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు.  2003 నుండి 2005 వరకు గోవాడియా  ఆరు సార్లు చైనాకు రహస్యంగా వెళ్లాడని గుర్తించారు.  చైనా రక్షణ ఇంజనీర్లకు స్టెల్త్ క్రూయిజ్ మిసైల్ ఎగ్జాస్ట్ నాజిల్  రూపకల్పనలో సహాయం చేసినట్లుగా గుర్తించారు.  ఈ సాంకేతికత చైనా క్రూయిజ్ మిసైళ్లను రాడార్ , ఇన్‌ఫ్రారెడ్ డిటెక్షన్ నుండి తప్పించేలా చేసింది. ఈ సేవలకు చైనా నుండి  110,000 డాలర్లు అంటే సుమారు రూ.91 లక్షలు అందుకున్నట్లుగా ఆధారాలు లభించాయి. వీటితో  గొవాడియా హవాయిలోని మౌయిలో 3.5 మిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ ఇంటి మార్ట్‌గేజ్ చెల్లించడానికి ఉపయోగించాడు. చైనాతో పాటు, గోవాడియా  జర్మనీ, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ లోని వ్యక్తులకు కూడా రహస్య సమాచారాన్ని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, చైనా  H-20 స్టెల్త్ బాంబర్ అభివృద్ధికి అతని సమాచారం సహాయపడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.


అక్టోబర్ 2005లో గోవాడియా  అరెస్ట్ 


అక్టోబర్ 2005లో, FBI గోవాడియా ను అరెస్టు చేసింది. 500 పౌండ్ల రహస్య పత్రాలు , ఎలక్ట్రానిక్ ఆధారాలను స్వాధీనం చేసుకుంది.  జాతీయ రక్షణ సమాచారాన్ని అనధికార వ్యక్తులకు అందించినట్లు అభియోగాలు నమోదయ్యాయి.  2010లో, హవాయిలోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగిన విచారణలో, 17 ఆరోపణలలో 14 కేసుల్లో  దోషిగా  తేల్చారు.  ఇందులో  ఎస్పియనేజ్ యాక్ట్ , ఆర్మ్స్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ యాక్ట్ ఉల్లంఘనలు, మనీ లాండరింగ్,   2001-2002లో తప్పుడు టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. జనవరి 24, 2011న, 32 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం  కొలరాడోలోని  ADX ఫ్లోరెన్స్ సూపర్‌మాక్స్ జైలు లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2032లో విడుదలవుతాడు. 
 .
రహస్య సమాచారం ఏమీ ఇవ్వలేదని గోవాడియ ాలాయర్లు


గోవాడియా లాయర్లు  అతను కేవలం  పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందించినట్లు వాదించారు.  అతను రూపొందించిన ఎగ్జాస్ట్ నాజిల్ బేసిక్ స్టఫ్ అని  చెప్పారు.  గోవాడియా కుమారుడు అష్టన్ గోవాడియా, విచారణలో FBI కీలక సాక్ష్యాలను దాచిందని, విచారణను తప్పుదోవ పట్టించిందని ఆరోపించాడు. అయితే  గోవాడియా   తాను చేసినది దేశద్రోహం  అని ఒప్పుకున్నాడు. దాంతో శిక్ష ఖరారు అయింది.