Omicron New Variant BF.7:
ఎన్నో అనుమానాలు..
ఇన్నాళ్లు అంతా బానే ఉందనుకున్నా...మరోసారి కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే చైనా, అమెరికా, జపాన్‌లో బాధితుల సంఖ్య పెరుగు తోంది. భారత్‌లోనూ ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగూ కొవిడ్ వేరియంట్ BF.7 కేసులే. అందుకే...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రికాషనరీ డోస్ వేసుకోవాలని
పిలుపునిస్తున్నాయి. ఈ క్రమంలోనే...ఇప్పటికే రెండో డోసులు తీసుకున్న వాళ్లు సందిగ్ధంలో ఉన్నారు. పాత వ్యాక్సిన్‌లు కొత్త వేరియంట్‌లపై సమర్థంగా పని చేస్తాయా..? లేదా అన్నదే అందరి అనుమానం. అయితే...దీనిపై పలువురు పరిశోధకులు వివరణ ఇచ్చారు. కొత్త వేరియంట్‌పై పాత వ్యాక్సిన్‌లు ఏమేర పని చేస్తాయో చెప్పారు.
మ్యుటేషన్ వల్ల తీవ్రత..
సెల్‌హోస్ట్, మైక్రోబ్ జర్నల్ అధ్యయనం ప్రకారం...BF-7 వేరియంట్‌కు మన శరీరంలోని యాంటీబాడీలను తప్పించుకుని తిరిగే గుణం ఉంటుంది. అంటే...యాంటీ బాడీలనూ దాటుకుని శరీరంలోకి ప్రవేశించి ఇబ్బంది పెడతాయి. మరో ఆందోళనకర విషయం ఏంటంటే...పాత వేరియంట్‌లతో పోల్చి చూస్తే...BF-7 వేరియంట్‌కు 4.4 రెట్లు అధికంగా ఇమ్యూనిటీ ఉంటుంది. ఇప్పటికే వ్యాక్సిన్‌లు తీసుకున్న వారికీ ఈ వేరియంట్ సోకే ప్రమాదముంది. మ్యుటేషన్ కారణంగా...వైరస్ ప్రోటీన్ స్పైక్‌లో మార్పులు వస్తాయని ఇవి వైరస్‌ను మరింత బలంగా మార్చుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆర్ వాల్యూ అధికం..
సాధారణంగా...వైరస్ తీవ్రతను R వాల్యూ ఆధారంగా నిర్ధరిస్తారు. BF-7 వేరియంట్ R వాల్యూ 10-18 వరకూ ఉంది. అంటే...BF-7 వేరియంట్ సోకిన వ్యక్తి కనీసం 10-18 మందికి ఆ వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశముంటుంది. ఇప్పటి వరకూ ఉన్న కరోనా వేరియంట్‌లలో అత్యధిక R వాల్యూ కలిగిన వేరియంట్ ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా వెల్లడించింది. అంతకు ముందు వచ్చిన ఆల్ఫా వేరియంట్ R వాల్యూ 4-5 వరకూ ఉండగా..డెల్టా వేరియంట్ R వాల్యూ 6-7 వరకూ నమోదైంది. వేరియంట్‌లు ఏవైనా...వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆపకుండా కొనసాగిస్తే ప్రమాదం నుంచి బయట పడొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. కాస్తంత జాగ్రత్తతో ముప్పు నుంచి తప్పించుకోవచ్చని
అంటున్నారు. గత రెండు నెలలుగా ఈ కొత్త వేరియంట్ భారత్‌లో కనిపిస్తున్నప్పటికీ...ఇప్పటి వరకూ 4 కేసులే నమోదయ్యాయి. అందుకే... పెద్దగా ఆందోళన పడాల్సిన పని లేదని వివరిస్తున్నారు.
నాసల్ వ్యాక్సిన్..
కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే..ఇప్పుడు ముక్కు ద్వారా అందించే చుక్కల మందు కూడా వినియోగంలోకి రానుంది. బయోటెక్ సంస్థ తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. భారత్ బయోటెక్ తయారు చేసిన iNCOVACC నాసల్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి అందించనున్నారు. సాధారణంగా వ్యాక్సిన్ అనగానే మనకు సిరంజీ గుర్తుకొస్తుంది. వయల్ నుంచి మందు తీసి నీడిల్‌తో మన శరీరంలోకి ఎక్కిస్తారు. ఫలితంగా.. .అది కరోనాపై పోరాటం చేసి కట్టడి చేస్తుంది. కానీ...నాసల్ వ్యాక్సిన్ తీరు వేరు. నేరుగా ముక్కులో చుక్కల ద్వారా అందిస్తారు. కరోనా వైరస్ ముక్కులో ఎక్కువ కాలం పాటు నివసిస్తుందన్న పరిశోధనలు ఆధారంగా చేసుకుని ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. ఈ చుక్కలను ముక్కు ద్వారా అందిచడం వల్ల వైరస్‌పై చాలా సమర్థంగా పని చేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని వైద్యులు చెబుతున్నారు.
Also Read: Cervical Cancer: సర్వికల్ క్యాన్సర్ టీకాలు బాలికలకి వేయొచ్చా? HPV వ్యాక్సిన్ అంటే ఏంటి?