Karnataka CM Race:


సోనియా చెప్పాకే..


కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు దాదాపు ఖరారైనట్టే. ఇక లాంఛనంగా ప్రకటించడం ఒక్కటే మిగిలింది. త్వరలోనే ఈ ప్రకటన చేయనుంది హైకమాండ్. అయితే...చివరి వరకూ రేసులో ఉన్న డీకే శివకుమార్ ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. ఎలాగైనా సరే సీఎం కుర్చీలో కూర్చోవాలని పట్టుదలతో ఉన్న ఆయన...ఆఖరికి త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ రేసు మొదలు కాకముందే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దరామయ్యతో విభేదాలున్నాయన్న విమర్శల్ని కొట్టి పారేశారు. పార్టీ కోసం చాలా సార్లు ఎన్నో త్యాగాలు చేశానని అన్నారు. ఈ సారి కూడా అదే జరిగింది. ఖర్గే, రాహుల్‌తో వరుస భేటీలు అయిన డీకే...మనసు మార్చుకోలేదు. కానీ...సోనియా గాంధీకి విధేయుడైన ఆయన..ఆమెతో భేటీ అయిన తరవాత కథంతా మారింది. అప్పటి వరకూ ఆయనలో ఉన్న పట్టుదల తగ్గిపోయింది. సంతోషంగా కాకపోయినా...గౌరవంగానైనా హైకమాండ్‌ నిర్ణయానికి తలొగ్గారు. సోనియాతో ఆయన సమావేశమైన తరవాతే...ఈ సస్పెన్స్‌కి తెర పడింది. కర్ణాటక భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని సోనియా అన్నీ వివరంగా మాట్లాడినట్టు సమాచారం. అందుకే...తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకున్నారు శివకుమార్. ఈ నిర్ణయంతో..సంతోషంగా లేరని, కానీ కర్ణాటక ప్రజల భవిష్యత్‌ గురించి ఆలోచించి హైకమాండ్‌కి డీకే "ఓకే" చెప్పారని ఆయన సోదరుడు డీకే సురేష్ వెల్లడించారు.


జాగ్రత్తపడ్డారా..? 


ఇక ఎమ్మెల్యేల సపోర్ట్ పరంగా చూసినా..సిద్దరామయ్యకే ఎక్కువ మంది మొగ్గుతున్నారు. అలాంటప్పుడు సిద్దరామయ్యను కాదని డీకేకి పదవి అప్పగిస్తే మళ్లీ అంతర్గతంగా కొట్లాటలు మొదలవుతాయని భావించారు సోనియా. అందుకే..ముందుగానే డీకేని పిలిచి బుజ్జగించారు. డిప్యుటీ సీఎం పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు అప్పగిస్తామని చెప్పారు. ఆ తరవాతే ఆయన బలవంతంగా అయినా మనసు మార్చుకున్నారు. అయితే...ఎప్పుడు కూడా ఆయన హైకమాండ్‌కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. బ్లాక్‌మెయిల్ చేసే రకం కాదు అని గట్టిగానే తేల్చిచెప్పారు. సోనియా, రాహుల్‌తో పాటు ఖర్గే కర్ణాటకను అభివృద్ధి దిశగా నడిపించడంలో సక్సెస్ అవుతారన్న నమ్మకముందని గతంలోనే వెల్లడించారు. ఫలితాలు రాకముందే..సోనియా తనతో "నీపై నమ్మకముంది. కచ్చితంగా కర్ణాటకలో గెలుస్తాం. అది నీ వల్లే సాధ్యమవుతుంది" అని చెప్పినట్టో ఓ ఇంటర్వ్యూలో అన్నారు డీకే. మొదటి నుంచి సోనియాకు సన్నిహితంగా ఉండడమే కాకుండా...ఆమె చెప్పిన మాట ఏదైనా తుచ తప్పకుండా పాటిస్తూ వచ్చారు శివకుమార్. ఈ సారి కూడా ఆమె మాటను గౌరవిస్తూ ఉత్కంఠకు తెర దించారు. 




ప్రమాణ స్వీకారం..


అతి త్వరలోనే సీఎం ఎవరన్న అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే డీకేతో పాటు సిద్దరామయ్య మరోసారి ఢిల్లీలోని ఖర్గే నివాసానికి వెళ్లారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. మరో 48 గంటల్లో క్యాబినెట్‌ని కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకారానికీ అంతా సిద్ధమవుతోంది. బెంగళూరులోనే ఈ కార్యక్రమం జరగనుందని సమాచారం. అందుకే...ఇటు ఢిల్లీతో పాటు అటు కర్ణాటకలోనూ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సిద్దరామయ్య ఇంటి వద్ద సీఎం స్థాయి సెక్యూరిటీని పెంచారు అధికారులు. అభిమానులు ఆయన ఫోటోలకు పాలాభిషేకం చేస్తూ సందడి చేస్తున్నారు. 




Also Read: కేంద్ర కేబినెట్‌లో మార్పులు- న్యాయశాఖ నుంచి రిజిజు ఔట్‌