Food Waste Index Report 2024: ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో ఆహార వృథా జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ United Nations Environment Programme విడుదల చేసిన Food Waste Index Report 2024 ఇదే విషయం వెల్లడించింది. 2022లో అందరికీ అందుబాటులో ఉన్న ఆహారంలో ఐదో వంతు వృథా చేసినట్టు స్పష్టం చేసింది. దాదాపు 1.05 బిలియన్ టన్నుల ఆహారం వృథా అయిందని తెలిపింది. ప్రతి ఇంట్లోనూ పెద్ద ఎత్తున ఫుడ్ వేస్ట్ చేసినట్టు వివరించింది. ఓ వైపు ఇలా ఆహారం అంతా వృథా అవుతుంటే...మరోవైపు ఆకలితో అలమటిస్తున్న వాళ్ల సంఖ్య 783 మిలియన్లకు చేరుకుంది. ఆహార వృథా ఎక్కువగా ఇళ్లలోనే జరుగుతోందని తేల్చి చెప్పింది ఈ నివేదిక. 


"ప్రపంచవ్యాప్తంగా రోజూ ఇళ్లలో కనీసం ఓ బిలియన్ మీల్స్ వృథా అవుతున్నాయి. 2022లో ఇళ్లలో 631 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయింది. ఇక ఫుడ్ సర్వీస్‌ సెక్టార్‌లో 290 మిలియన్ టన్నులు, రిటైల్ సెక్టార్‌లో 131 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయిపోయింది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న దేశాల్లోనూ ఈ ఫుడ్ వేస్ట్‌ ఎక్కువగా నమోదవుతోంది"


- ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్


ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండడం, కరవులు తలెత్తడం లాంటి పరిణామాలూ ఈ ఆహార వృథాకు కారణాలుగా ఉంటున్నాయని నివేదిక వివరించింది. ఆహారాన్ని నిల్వ ఉంచడం, ప్రాసెస్ చేయడం, రవాణా చేయడం లాంటి ప్రక్రియల్లోనూ సమస్యలు వస్తున్నాయని తెలిపింది. అధిక ఆదాయ, మధ్య ఆదాయ, అల్ప ఆదాయ దేశాల్లో సగటున ప్రతి ఇంట్లో ఏడాదికి తలసరి 7 కిలోల ఆహారం వృథా అవుతోంది. కేవలం అధిక ఆదాయం ఉన్న దేశాల్లో మాత్రమే ఈ సమస్య ఉందనుకోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అని వెల్లడించింది. ఈస్థాయిలో ఫుడ్ వేస్ట్ అవడం వల్ల లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.