Andhra Pradesh News: NTR జిల్లా నందిగామ నియోజకవర్గం. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నందిగామ(Nandigama)..విజయవాడ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఒకటి. ప్రస్తుతం వైసీపీ(YCP) తరపున మొండితోక జగన్మోహన్‌రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1955లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో నందిగామలో కొంతభాగంతోపాటు చందర్లపాడు, వీరులపాడు, కంచికచర్ల మండలాలు ఉన్నాయి. దాదాపు లక్షా 80 వేల ఓటర్లు ఉన్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతం కలిగిన నందిగామ నియోజవర్గం మొత్తం విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిగి ఇరువైపులా ఉంటుంది. విజయవాడకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే నందిగామ పట్టణం ఉంది.


ఎర్రన్నల గడ్డ
నందిగామ నియోజవర్గం మొదటి నుంచి వామపక్షాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. 1955లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ(CPI) నుంచి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు కాంగ్రెస్(Congress) అభ్యర్థిపై విజయం సాధించి నందిగామ తొలి ఎమ్మెల్యేగా చరిత్రకెక్కారు. ఆ తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లోనూ సీపీఐ ఈ సీటును నిలబెట్టుకుంది. సమీప కాంగ్రెస్ అభ్యర్థి బండి తిరుపతయ్యపై మరోసారి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు గెలుపొందారు. 1967లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. ఆ పార్టీ నుంచి అడుసుమిల్లి సూర్యనారాయణరావు సీపీఐ అభ్యర్థి కోదండరామయ్యపై విజయం సాధించారు.1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందగా ఆ పార్టీ నుంచి వసంత నాగేశ్వరరావు(Vasantha Nageswararao) జయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయింది. టిక్కెట్ కోసం పలువురు పోటీపడ్డారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత నాగేశ్వరరావుకు కాకుండా మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి సూర్యనారాయణరావు(Adusumilli Suryanarayana)కు టిక్కెట్ కేటాయించింది. ఇందిరా కాంగ్రెస్ నుంచి మధుసూదనరావు నిల్చున్నారు. దీంతో ఓట్లు చీలిపోయి జనతాపార్టీ అభ్యర్థి ముక్కపాటి వెంకటేశ్వరరావు(Mukkapati Venkateswarao) గెలుపొందారు.


పసుపు ప్రభంజనం
తెలుగుదేశంపార్టీ (Telugudesam) ఆవిర్భావం అనంతరం జరిగిన 1983 ఎన్నికల్లో NTR ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ సీట్లను తెలుగుదేశం కైవసం చేసుకుంది. అదే ఊపులో నందిగామ(Nandigama)లోనూ ఆ పార్టీ అభ్యర్థిగా మరోసారి వసంత నాగేశ్వరరావు విజయ దుందుబి మోగించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి ముక్కపాటి వెంకటేశ్వరరావుపై ఆయన గెలుపొందారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లోనూ కేవలం 2వేల ఓట్లలోపు మెజార్టీతో మరోసారి వసంత నాగేశ్వరరావు గెలుపొంది ఎన్టీఆర్(NTR) ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీని వీడిపోయారు.


1989లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీయగా ఆపార్టీ తరపున ముక్కపాటి వెంకటేశ్వరరావు మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1994 లో జరిగిన ఎన్నికల్లో యువకెరటం దేవినేని వెంకటరమణ(Devineni Venkataramana) తెలుగుదేశంపార్టీ తరపున విజయకేతనం ఎగురవేశారు. అతి తక్కువ కాలంలో నియోజకవర్గంపై పట్టుసాధించారు. పాలనలో వినూత్న ఒరవడితో ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా... చంద్రబాబు(Chandrababu) మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న దేవినేని వెంకటరమణ.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రైలు ప్రమాదంలో కన్నుమూశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రమణ సోదరుడు దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma Maheswara Rao) పోటీలో నిలవగా....కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత వెంకట కృష్ణప్రసాద్‌(Vsantha Krishna Prasad) కాంగ్రె తరపున బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో దేవినేని ఉమ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు.


2004లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి దేవినేని ఉమ తెలుగుదేశం నుంచి బరిలో దిగగా....ఈసారి ఏకంగా మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు పోటీలో నిల్చున్నా తెలుగుదేశం గెలుపును నిలువరించలేకపోయారు. వరుసగా రెండోసారి దేవినేని ఉమ గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో నందిగామ ఎస్సీ నియోజకవర్గంగా మార్పుచెందడంతో ...2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తంగిరాల ప్రభాకరరావు(Thangiralla Prabhakarao) గెలుపొందారు. 2014లోనూ తెలుగుదేశం నుంచి తంగిరాల ప్రభాకరావు పోటీలో నిలవగా...తొలిసారి వైసీపీ(YCP) నుంచి మొండితోక జగన్మోహన్‌రావు(Mondithoka Jaganmohanrao) బరిలో నిల్చున్నారు ఈ ఎన్నికల్లోనూ తంగిరాల ప్రభాకర్‌రావు విజయం సాధించినా...అనతికాలంలోనే గుండెపోటుతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఉపఎన్నికకు వైసీపీ దూరంగా ఉండాలని భావించినా....కాంగ్రెస్ నుంచి బోడపాటి బాబూరావు పోటీలో ఉండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలుగుదేశం నుంచి తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య(Sowmya) బరిలో నిల్చుని రికార్డు మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ హవా నడవడంతో ఫ్యాన్ గాలిలో తెలుగుదేశం కొట్టుకుపోయింది. నందిగామ నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఓటమిపాలయ్యారు. వైసీపీ నుంచి డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి వీరివురే మళ్లీ పోటీపడనున్నారు.