Hindu Temple Vandalised:
హిందూ ఆలయంపై దాడి..
అమెరికాలోని నెవార్క్‌లోని హిందూ ఆలయంపై ఖలిస్థాన్ వేర్పాటు వాదులు దాడి చేశారు. ఆలయ గోడలపై ఖలిస్థాన్‌కి మద్దతుగా రాతలు రాశారు. గ్రాఫిటీతో భారత్‌కి వ్యతిరేకంగా స్లోగన్స్ రాశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే పలు దేశాల్లో ఇలా భారత్‌కి వ్యతిరేకంగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. ముఖ్యంగా యూకే, ఆస్ట్రేలియాలో ఈ ఘటనలు వెలుగు చూశాయి. Hindu American Foundation కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో ఉన్న Swaminarayan Mandir Vasana Sanstha ఆలయ గోడలపై ఇలాంటి రాతలు రాయడాన్ని ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది.
పోలీసులతో పాటు పౌరహక్కుల సంఘాలకూ ఈ దాడిపై విచారణ జరుపుతున్నాయి. విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెబుతున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ దాడిని ఖండించింది. భారతీయుల మనోభావాల్ని ఇలాంటి ఘటనలు దారుణంగా దెబ్బ తీస్తాయని అసహనం వ్యక్తం చేసింది.
"నెవార్క్‌లోని స్వామినారాయణ్ మందిర్‌పై జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాం. భారతీయుల మనోభావాలు దెబ్బ తీసే ఇలాంటి ఘటనలపై నిఘా పెట్టాలి. దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఒత్తిడి తీసుకొచ్చాం. అమెరికా అధికారులతో ఈ మేరకు మాట్లాడాం"
- భారత రాయబార కార్యాలయం, శాన్‌ఫ్రాన్సిస్కో
ఆస్ట్రేలియాతో పాటు కెనడాలోనూ కొందరు ఖలిస్థాన్ వేర్పాటు వాదులు ఇలానే హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ ఘటనల వల్ల ఆయా దేశాలతో భారత్‌కి ఉన్న మైత్రి దెబ్బ తింటోంది. ఈ ఏడాది ఆగస్టులో కెనడాలని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఖలిస్థాన్‌కి మద్దతుగా ఉన్న పోస్టర్‌లను ఆలయ ద్వారం వద్ద అంటించి వెళ్లారు ఆగంతకులు. CC కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి.