Himachal Political Crisis: హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. సభలో నినాదాలు చేయడం, గందరగోళం సృష్టించిన కారణంగా బహిష్కరణకు గురయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కి పాల్పడడం సంచలనమవుతోంది. ఈ క్రమంలోనే స్పీకర్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు వేయడం రాజకీయాల్లో మరింత వేడి రాజేసింది. బహిష్కరణకు గురైన వారిలో జైరామ్ ఠాకూర్, విపిన్ సింగ్ పర్మర్, బల్బీర్ వర్మ తదితరులున్నారు. అయితే...ఈ వేటు వేయకముందే బీజేపీ ఎమ్మెల్యే జైరామ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించే కుట్ర జరుగుతోందని అన్నారు. తమను బయటకు పంపించి బడ్జెట్‌ని ఆమోదించాలని భావిస్తున్నట్టు చెప్పారు.
"బహుశా మమ్మల్ని అసెంబ్లీ నుంచి బహిష్కరించే కుట్ర జరుగుతోంది. స్పీకర్ కుల్‌దీప్ సింగ్ పఠానియా ఇదే చేస్తారనిపిస్తోంది. మమ్మల్ని బహిష్కరించి సభలో బడ్జెట్‌ని ఆమోదించాలని చూస్తున్నారు"
- జైరామ్ ఠాకూర్, బీజేపీ ఎమ్మెల్యే
ఇప్పటికే మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గతేడాది ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కాంగ్రెస్ క్రమంగా పతనమవుతూ వస్తోందని విమర్శించారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో కాంగ్రెస్ ఓడిపోయిందని వెల్లడించారు. తన తండ్రి వీర్‌భద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్‌కి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారని, ఆయనకు గౌరవమిస్తూ ఓ విగ్రహం కూడా ఏర్పాటు చేయలేకపోయారని మండి పడ్డారు.
"మా నాన్న వీర్‌భద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్‌కి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన వల్లే ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయినా సరే ఆయన గౌరవార్థం ఓ విగ్రహం ఏర్పాటు చేయడానికి చోటు దొరకలేదు. మా నాన్నపై కాంగ్రెస్‌కి ఉన్న గౌరవం ఇదిమాకు ఈ పదవుల కన్నా భావోద్వేగాలే ముఖ్యం"
- విక్రమాదిత్య సింగ్, హిమాచల్ ప్రదేశ్ మాజీ మంత్రి