ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కేవలం 24 గంటల్లో వర్షాల కారణంగా జరిగిన ఘటనల్లో 19 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు కూలిపోయి, ఇళ్లు నీటిలో మునిగిపోవడం కారణంగా, పిడుగులు పడిన కారణంగా మృతి చెందిన ఘటనలు సంభవించాయి. చాలా చోట్ల నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. యూపీలో వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బారాబంకి, లఖింపూర్‌ఖేరి జిల్లాల్లో నిన్న, ఈరోజు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇచ్చారు. లక్నో, బారాబంకి సహా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటకం ఏర్పడింది.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో సెప్టెంబరు 13న భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలోని తెహ్రీ, బాగేశ్వర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిరంతర వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు కూలిపోయాయి. భారీ వర్షం హెచ్చరికలతో చంపావత్, ఉధమ్ సింగ్ నగర్‌లోని పాఠశాలలను మూసేశారు.
సెప్టెంబరు 14 వరకు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్‌గా ఉండాలని తెలిపింది. సెప్టెంబరు 14, 15 తేదీల్లో ఒడిశాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లో కూడా అప్పుడప్పుడు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాజస్థాన్‌లో సెప్టెంబరు 12,13 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కార్యాలయం తెలిపింది.
అలాగే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో, మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతంలో, విదర్భ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపురలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలతో పాటు యానాంలో, కర్ణాటకలో, తమిళనాడులో, పుదుచ్ఛేరిలో, కేరళలో కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబరు 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని, సెప్టెంబరు 17 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
తూర్పు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కోస్తా ఆంధ్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘలయలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.