Andhra Pradesh Update: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణ(Telangana)లో హైదరాబాద్(Hyderabad)తోపాటు వివిధ జిల్లాల్లో భారీ వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గుజరాత్(Gujarat)తీరంపై తుపాన్, కేరళ(Kerala) ద్రోణి ఆవరించి ఉండటంతో వీటి ప్రభావం వల్ల తెలుగురాష్ట్రాల్లో విస్తరంగా వర్షాలు కురవనున్నాయి..
తెలంగాణలో జోరువానలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ(Telangana)వ్యాప్తంగా ఇప్పటికే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా వానలు దంచికొట్టనున్నట్లు హైదారాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి,వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులను వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. వర్షాలతో పాటు భారీగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికే హైదరాబాద్ (Hyderabad)తడిచి ముద్దయ్యింది. కొత్తపేట,మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, వనస్థలిపురం, ఉప్పల్, నాగోల్, బేగంపేట ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇక్కట్లుపడ్డారు. జీహెచ్‌ఎంసీ,(GHMC) విపత్తుల నిర్వహణ బృందం రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. రానున్న మూడురోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. వీకెండ్ కావడంతో ప్రజలు పెద్దఎత్తున బయటకు వచ్చే అవకాశం ఉండటంతో...అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా సాయంత్రం వర్షం పడే అవకాశం ఉండటంతో ట్రాఫిక్(Traffic)లో ఇబ్బందిపడతారని సూచించారు..
ఏపీలోనూ భారీ వర్షాలు
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ(Ralayalasema) జిల్లాల్లో భారీగా వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఆదోని, అనంతపురం, గుంతకల్లు, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం కన్నా సాయంత్రం నుంచి వానలు ఎక్కువపడే అవకాశం ఉంది
ఉత్తర కోస్తాకు వర్ష సూచన
తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాబోయే మూడురోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమ,దక్షిణ కోస్తాలోనూ జోరుగా వానలు పడనున్నాయి. పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని...పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.
వర్షంతో పాటు ఈదురుగాలులు బాగా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దని తెలిపారు. పిడుగులుపడే అవకాశం ఉండటంతో పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు సైతం జాగ్రత్తగా ఉండాలన్నారు. పచ్చని చెట్లు కిందకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దన్నారు. సాయంత్రం, రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో దూర ప్రయాణాలు చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్లపై వర్షం ధాటికి గుంతలు కనిపించకపోవచ్చని...ఎదురుగా వస్తున్న వాహనాలతో సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప..ఈ రెండు రోజులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.