Heartbreaking Video:
అందరి జీవితం ఒకేలా ఉండదు..
నిద్ర లేచింది మొదలు హడావుడి. పరుగులు పెడుతూ ఆఫీస్‌లకు వెళ్లిపోతాం. దాదాపు 10 గంటలు అక్కడే ఉండిపోతాం. రాత్రికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్లీ ఉదయం ఆఫీస్‌కు రన్నింగ్ రేస్ మొదలవుతుంది. ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. ఫస్ట్ తారీఖు రాగానే జీతం పడిపోతే... హమ్మయ్య అనుకుంటాం. అవి వారం రోజుల్లోనే అయిపోతాయ్. అయ్యో...ఇంత కష్టపడినా డబ్బు ఏమీ మిగలటం లేదే అని బాధ పడిపోతాం. కానీ...కొందరు జీవనం సాగించేందుకు రోజుకో యుద్ధం చేస్తుంటారు. చాలీ చాలని డబ్బులతోనే ఎక్కడ పడితే అక్కడ పని చేస్తూ...ఎక్కడంటే అక్కడ నిద్రపోతూ కష్టం చేస్తారు. వయసులో ఉన్న వాళ్లే కాదు. వృద్ధులు కూడా ఇలాంటి శ్రమ పడుతూనే ఉంటారు. మనం రోడ్లపైన ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాం. కొందరు ముసలి వాళ్లు కూడా కాయకష్టం చేస్తుంటారు. ఇప్పుడీ వీడియోలో కనిపించే పెద్దాయనా అంతే. రోజంతా కష్టపడి సాయంత్రం హాయిగా ఓ కాకా హోటల్‌లో కూర్చుని జేబులో నుంచి డబ్బంతా బయటకు తీశాడు. చిల్లర టేబుల్‌పైన పెట్టి...నోట్లు చేతులో పట్టుకున్నాడు. ఒక్కో పైసా లెక్కపెడుతూ "నేనివాళ ఎంత కష్టపడ్డాను. ఎంత సంపాదించాను" అని చూసుకున్నాడు. దూరం నుంచి ఎవరో ఓ వ్యక్తి దీన్ని వీడియో తీశాడు. పెద్దాయన డబ్బులు లెక్కిస్తున్న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన వాళ్లు చాలా ఎమోషనల్ అవుతున్నారు. వాళ్లూ షేర్ చేస్తున్నారు. ఇప్పటికే 3లక్షల మంది ఈ వీడియో చూశారు. "అందరి జీవితం ఒకేలా ఉండదు. ఈ వీడియో నన్నెంతో కదిలించింది" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా..."డబ్బుకి విలువ ఇవ్వండి. జీవితం నేర్పించే పాఠం ఇదే" అని మరో నెటిజన్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇలా రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.