HC Dismisses PIL Seeking Delhi CM  Removal : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన  ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్ చేసింది.  జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ విషయంలో న్యాయపరమైన జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కారణంగా పిల్ ను డిస్మిస్ చేసింది. 


మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.  జైలు నుంచే కేజ్రీవాల్ పాలన సాగిస్తారని ఆప్ మంత్రులు ప్రకటించారు. ఇప్పటికీ కేజ్రీవాల్ సీఎంపదవికి రాజీనామా చేయలేదు. జైలు నుంచే ఆయన ఆదేశాలు ఇస్తున్నారని.. మంత్రులు చెబుతున్నారు. అయితే  ఇది రాజ్యాంగ విరుద్ధమని.. ప్రభుత్వ విశ్వసనీయత.. ప్రతిష్ట  దిగజారుతుందని హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వారు వాదించారు. ఈ వాదనను ఢిల్లీ హైకోర్టు అంగీకరించలేదు.  


అరెస్ట్, ఈడీ కస్టడీపై కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం న్యాయస్థానం విచారించి ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. నేటితో అంటే గురువారంకో కస్టడీ ముగిసినందున కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశాయి. మధుమేహ బాధితుడైన కేజ్రీవాల్‌ రక్తంలో చక్కెరస్థాయిల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయని వెల్లడించాయి. కేజ్రీవాల్‌ బ్లడ్‌షుగర్‌ లెవెల్‌ ఒక దశలో 46 ఎంజీకి పడిపోయిందని డాక్టర్లు చెప్పారని, ఇది చాలా ప్రమాదరమని తెలియజేశాయి.   మరోవైపు ఇదే కేసులో గోవా ఆప్ లీడర్లకు కూడా ఈడీ తాజాగా సమన్లు అందించింది. నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. 


మద్యం కుంభకోణం కేసులో నిజాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం కోర్టులో బయటపెట్టబోతున్నట్లు ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌ చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ ఆయన్ను అరెస్టు చేసిందంటూ ఆమె బుధవారం వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘మంగళవారం కలిసినప్పుడు నా భర్త నాతో పలు విషయాలు పంచుకున్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదు. డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో తాగునీటి సమస్యను నివారించాలని లేఖ ద్వారా పంపిన ఉత్తర్వులను కూడా కేంద్రం వివాదాస్పదంగా మారుస్తోంది. ఢిల్లీ నాశనం కావాలని కోరుకుంటోంది. ఈడీ అధికారులు ఇప్పటిదాకా 250 సార్లు సోదాలు నిర్వహించారు. మా నివాసంలో సోదాలు చేసి కేవలం రూ.73 వేలు స్వా«దీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో చేతులు మారిన సొమ్ము ఇంకా దొరకలేదని ఈడీ చెబుతోంది. మద్యం కుంభకోణంలో నిజనిజాలు, ఆ డబ్బు ఎక్కడుందో గురువారం కోర్టులో బయటపెడతానని కేజ్రీవాల్‌ నాతో చెప్పారు. అందుకు రుజువులు కూడా సమర్పిస్తారు’’ అని వీడియో సందేశంలో సునీత స్పష్టం చేశారు.