హుజూరాబాద్ నియోజకవర్గంలో నేడో రేపో ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో టీఆర్ఎస్ తరపున ట్రబుల్ షూటర్ .. హరీష్ రావు రంగంలోగి దిగారు. హుజూరాబాద్‌లో ఇప్పటి వరకూ తెర వెనుక కార్యకలాపాలను చక్కబెడుతున్న ఆయన ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. పెద్ద ఎత్తున చేరికలకు ప్లాన్ చేశారు. కాంగ్రెస్ బీజేపీలకు చెందిన పలువురు నేతలకు గురువారం కండువాలు కప్పారు. ఈ సందర్భంగా దళితుల ఓట్లనే హరీష్ గురి పెట్టారు. 


హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి రెండూ ఉమ్మడిగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇతర నియోజకవర్గానికి చెందిన దళిత నేతను నిలబెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూండటాన్ని  హరీష్ రావు పరోక్షంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా దళితుల్ని నిలబెట్టి దళిత ఓట్లను చీల్చి.. బీజేపీకి మేలు చేయబోతున్నారని హరీష్ రావు అన్నారు. ఇది దిగజారుడు రాజకీయమేనని స్పష్టం చేశారు. దళితబంధు పథకంతో దళితులంతా టీఆర్‌ఎస్‌ వైపే నిలవడం ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేక కుట్రలు, కుమ్మక్కులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. 




ఈటల రాజేందర్ ప్రచారంలో నరేంద్రమోడీ ఫోటోలు పెట్టకుండా ప్రచారం చేస్తున్నారని హరీష్ కొత్త పాయింట్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో చూడగానే పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ , గ్యాస్‌ సిలిండర్‌ ధరలు గుర్తుకు వచ్చి ఓట్లు పడవనే ఉద్దేశంతోనే ఈటల మోడీ ఫోటో పెట్టుకోవడం లేదని హరీష్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ హుజూరాబాద్ కోసం ప్రధానమంత్రి దగ్గరకు వెళ్లి రూ. వెయ్యి కోట్ల ప్యాకేజీ తేవాలన్నారు. మళ్లీ బీజేపీకి ఓటు వేస్తే పెట్రోల్ రేటు  రూ. 200, గ్యాస్ రేటు రూ. 1500దాటుతుందని ప్రజల్ని హరీష్‌రావు హెచ్చరించారు. హూజూరాబాద్‌లో ఎవరు గెలిస్తే లాభమో ఆలోచించాలని ప్రజల్ని హరీష్ రావు కోరుతున్నారు. ఈటల గెలిస్తే.. ఆయనకు వ్యక్తిగతంగా లాభమని కానీ టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు లాభమని విశ్లేషిస్తున్నారు. 





 
 తెలంగాణరాష్ట్ర సమితికి హరీష్ రావు ట్రబుల్ షూటర్. ఎక్కడ కీలకమైన ఎన్నికలు జరిగినా కేసీఆర్ ఆయనకే బాధ్యతలు ఇస్తూ ఉంటారు. అయితే తొలి సారిగా ఆయన దుబ్బాక ఉపఎన్నికల్లో విఫలమయ్యారు. అక్కడ బీజేపీ గెలవడంతో ఆయనకు తొలి సారి షాక్ తగిలినట్లయింది. అయితే ఆ  తర్వాత ఆయన తన వ్యూహాలకు మరింత పదును పెట్టుకున్నారు. ఇప్పుడు హూజూరాబాద్ నియోజకవర్గం బాధ్యతల్ని కూడా కేసీఆర్.. హరీష్ రావుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.దీంతో ఆయన రంగంలోకి దిగి... ముందుగా చేరికలపై దృష్టి పెట్టారు. అన్ని పార్టీల ద్వితీయ శ్రేణి నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో టీఆర్ఎస్‌లో కొత్త ఉత్సాహం ప్రారంభమయింది.