సెంట్రల్ విస్తా పనులు పూర్తయ్యాయి..


దిల్లీలోని విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్‌ వరకూ అత్యంత భారీగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా పనులు చాలా వేగంగా జరిగాయి. జులై 18వ తేదీ నాటికి ముఖ్యమైన పనులన్నీ పూర్తైపోతాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్‌దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఒకట్రెండు అండర్‌పాస్‌లలో చిన్న చిన్న పనులు జరుగుతున్నాయని, అనుకున్న గడువులోగా అవి కూడా పూర్తైపోతాయని స్పష్టం చేశారు. ఓ మీడియా సమావేశంలో ఈ విషయం చెప్పారు హర్‌దీప్ సింగ్. "చిన్న పనులు మినహా సెంట్రల్ విస్తా నిర్మాణం దాదాపు పూర్తైనట్టే. జులై 15 లేదా 18వ తేదీ వరకూ తుది రూపు వచ్చేస్తుంది" అని అన్నారు. సోమవారం ఈ నిర్మాణ పనులను సమీక్షించారు. దిల్లీ ప్రజలు సెంట్రల్ విస్తాను చూసి ఆశ్చర్యపోతారని, అంత గొప్పగా రూపుదిద్దుకుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రీడెవలప్డ్‌ సెంట్రల్ విస్తాలో అండర్‌పాస్‌లు, వెండింగ్ జోన్లు, ప్రజలకు సౌకర్యాలు, పాత్‌వేస్‌, గ్రీన్ స్పేసెస్‌తో పాటు మరి కొన్ని ఆకర్షణలు ఉంటాయని చెప్పారు హర్‌దీప్ సింగ్.





 


దిల్లీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది..


ఈ టూర్‌ పూర్తయ్యాక, ఆయన ట్విటర్ వేదికగా అక్కడి ఫోటోలు పంచుకున్నారు. "సెంట్రల్ విస్తా నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక్కడికి వచ్చి అన్నింటినీ సమీక్షించాను. దిల్లీ చరిత్రలో ఇది ప్రత్యేకంగా నిలిచిపోతుంది" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక్కడ ఏమేం వసతులు ఉంటాయన్నది ఆ ట్వీట్‌లోనే ప్రస్తావించారు హర్‌దీప్ సింగ్. ఈ కొత్త సెంట్రల్ విస్తా బిల్డింగ్ త్రిభుజాకారంలో ఉంటుంది. సెంట్రల్  సెక్రటేరియట్ సహా  విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకూ మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్ నిర్మించారు. ఇందులోనే ప్రధానమంత్రి ఇల్లు, ప్రధాని కార్యాలయంతో పాటు వైస్‌ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌నీ నిర్మించారు. 


Also Read: Rishi Sunak Profile: ఇంగ్లాండ్ ప్రధాని రేసులో ఇండియా సంతతి వ్యక్తి- రిషి సునక్ ఎవరో తెలుసా?