Hanuman Flag Row: హనుమాన్ జెండా కర్ణాటకలో కాంగ్రెస్,బీజేపీ మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలకు దారి తీసింది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కెరగొడు గ్రామంలో కొందరు 108 అడుగుల పోల్‌ పెట్టి దానిపై హనుమాన్ జెండా ఎగరేశారు. గత వారం ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య రగడ కొనసాగుతోంది. ఉద్రిక్తతలు పెరగడం వల్ల పోలీసులు ఆ గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. జెండా ఎగరేసేందుకు గ్రామ పంచాయతీ అనుమతినిచ్చినప్పటికీ కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే ఆ జెండాని తొలగించాలని కొందరు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే...గ్రామస్థులు మాత్రం అందుకు అంగీకరించలేదు. కావాలనే దీన్ని రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. జెండాని తొలగించకుండా ఆందోళనలు నిర్వహించారు. గ్రామస్థులకు బజ్‌రంగ్‌ దళ్‌ కార్యకర్తలు మద్దతు పలికారు.  ఫలితంగా...ఈ వివాదం మరింత రాజుకుంది. అటు బీజేపీ,జేడీఎస్ కార్యకర్తలూ ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ అల్లర్లు మరింత పెరగకుండా పోలీసులు భారీ ఎత్తున గ్రామంలో మొహరించారు. ఈ నిరసనలో భాగంగా గ్రామంలో చాలా మంది దుకాణాలు మూసేశారు. గ్రామ పంచాయతీ అధికారులు జెండాని తొలగించేందుకు ప్రయత్నించడం వల్ల ఘర్షణలు మరింత పెరిగాయి. "గో బ్యాక్" అంటూ గ్రామస్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్యానర్లను ధ్వంసం చేయడం వల్ల ఈ వివాదం రాజకీయ మలుపు తిరిగింది. ఆ అల్లర్ల మధ్యే గ్రామ పంచాయతీ అధికారులు జెండాని తొలగించారు. ఫలితంగా..బీజేపీతో పాటు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల్లోనూ నిరసనలకు పిలుపునిచ్చింది బీజేపీ




ప్రభుత్వంపై ఆగ్రహం..


జెండాని తొలగించిన సమయంలో గ్రామస్థులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. హనుమాన్ జెండా స్థానంలో జాతీయ జెండాని ఎగరేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. హిందూ వ్యతిరేక ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. కాషాయ జెండాకి బదులుగా జాతీయ జెండాని ఎగరేయాల్సింది అని స్పష్టం చేశారు. జాతీయ జెండా ఎగరేయాలని తానే అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. 


"బహుశా దీని వెనక రాజకీయాలు ఉండొచ్చు. ఎవరు ఇదంతా చేస్తున్నారో తెలియదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఆధారంగా ఈ దేశం నడుచుకుంటోంది. రేపు ఎక్కడ పడితే అక్కడ కాషాయ జెండాలు ఎగరేస్తారేమో..? అలా ఎలా అనుమతిస్తాం. ఒక్క చోట అనుమతినిస్తే అన్ని చోట్లా అదే జరుగుతుంది. మనోభావాలు దెబ్బ తీయడం మా ఉద్దేశం కాదు. ఆలయానికి సమీపంలో హనుమాన్ జెండాని ఎగరేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకు ఏర్పాట్లు కూడా చేశాం"


- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి