Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక అప్‌డేట్ వచ్చింది. మసీదులో బయటపడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ జరపాలంటూ హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై తీర్పును వారణాసి కోర్టు  అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.


రిజర్వ్


జ్ఞానవాపి మసీదు-శృంగార్ గౌరీ కేసులో సెప్టెంబర్ 29న ఇరువర్గాల వాదనలను కోర్టు ఆలకించింది. ఆ తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. వారణాసి జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష్ తీర్పును వెలువరించాల్సి ఉంది.


తేల్చాల్సిందే


మసీదు ఆవరణలో కోర్టు ఆదేశాల మేరకు చేసిన వీడియో సర్వేలో అక్కడ శివలింగం బయటపడిందని హిందూ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అది శివలింగం కాదని, ఫౌంటేన్ అని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. దీంతో శివలింగానికి కార్బన్  డేటింగ్ జరిపించాలని సెప్టెబర్ 12న హిందూ వర్గాలు ఒక పిటిషన్ వేశాయి.


కార్బన్ డేటింగ్ అనేది శాస్త్రీయ ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా శివలింగం ఏకాలం నాటిదో తెలుసుకునే అవకాశం ఉంటుందని హిందూ వర్గాలు, పురావస్తు శాఖ చెబుతున్నాయి. దీనిని జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ అంజుమన్ ఇంతేజామియా వ్యతిరేకించింది. 


సానుకూలంగా


అయితే జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్​పై సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.


ఇదీ కేసు


జ్ఞాన్​వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్‌ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు. 


సర్వేలో


దీంతో జ్ఞాన్​వాపి మసీదు- శృంగార్‌ గౌరీ ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ప్రార్థన స్థలంలోని భూగర్భ నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది. అయితే మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ సర్వే నివేదికను అడ్వకేట్‌ కమిషనర్ కోర్టులో సమర్పించారు. అయితే అది శివలింగం కాదంటూ మసీద్‌ కమిటీ వాదిస్తోంది.  


సుప్రీం కోర్టుకు


ఈ వ్యవహారం తర్వాత సుప్రీం కోర్టుకు చేరింది. అయితే జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్‌ జుడీషియల్ సర్వీసులో ఉన్న అత్యంత సీనియర్, అనుభవమున్న న్యాయమూర్తి విచారిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది.


అలానే మసీదులో సీల్ వేసిన ప్రాంతాన్ని అలానే ఉంచాలని ఆదేశించింది. ముస్లింలు యథావిధిగా మసీదు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుపై ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీం పేర్కొంది. ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. 


Also Read: Ghaziabad Blast: సినిమా చూస్తుండగా పేలిపోయిన టీవీ- బాలుడు మృతి, మహిళకు గాయాలు!


Also Read: Biden-Ukraine war: పుతిన్ జోక్ చేయడం లేదు- అన్నంత పని చేసేలానే ఉన్నాడు: బైడెన్