Gun Fire in US: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. లింగ మార్పిడి చికిత్స చేయించుకున్న ఓ వ్యక్తి ప్లాన్ ప్రకారం వెళ్లి మరీ పలువురిపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ముగ్గురు చిన్నారులను కాల్చి చంపగా.. మరో ముగ్గురు వృద్ధులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందగా.. చివరకు పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా చనిపోయాడు. 


అసలేం జరిగిందంటే..?


అమెరికాలోని టెన్నిస్సే రాష్ట్రంలోని నాష్ విల్ లోని ఓ మిషనరీ పాఠశాలలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోప్లోయారు. అయితే పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు పాల్పడింది 28 ఏళ్ల నిందితుడు ఆడ్రే హలే గా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి లింగమార్పిడి చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు హలేని ఆమె అని సంభోదిస్తుండగా.. లింక్డిన్ ప్రొఫైల్ మాత్రం పురుషుడిగా చూపిస్తోంది. ఇది ఆకస్మికంగా జరిగిన షూటింగ్ కాదని పోలీసులు వెల్లడించారు. భారీ స్థాయిలో కాల్పులకు ప్రణాళిక రచించినట్లు ఆ వ్యక్తి వద్ద లభించిన మెనిఫెస్టో, మ్యాప్ ను బట్టి తెలుస్తోందన్నారు. తన ప్రణాళికలో పాఠశాల ఒకటని, ఇంకా పలు ప్రాంతాల్లో కాల్పులు జరపాలనుకున్నట్లు చెప్పారు. 


ఒకపక్కగా ఉన్న ప్రవేశ ద్వారం నుంచి పాఠశాలలోకి ప్రవేశించి, కాల్పులు జరుపుతూ భవనంలోకి వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల లోపు ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మృతుల్లో మరో ముగ్గురు 60 ఏళ్ల వయసు పైబడిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మృతుల్లో ఒకరు పాఠశాల హెడ్ అని సమాచారం. ఇక పోలీసుల కాల్పుల్లో హలే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటన వెనక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం, ఉన్నత విద్యార్హతలు ఉండడం గమనార్హం. ఈ హింసాకాండను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.


జనవరి 7న టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థి


అమెరికాలో కాల్పులు కొనసాగుతున్నాయి. వర్జీనియాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. ఉపాధ్యాయుడిని వెంటనే ఆసుపత్రిలో చేరాడు. వర్జీనియాలోని న్యూపోర్ట్ సిటీలోని ఎలిమెంటరీ స్కూల్లో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఏ విద్యార్థి గాయపడలేదు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు వర్జీనియా మేయర్ ఫిలిప్ జోన్స్ మీడియాకు తెలిపారు. విద్యార్థి వయస్సు ఎంత అనేది అధికారులు చెప్పనప్పటికీ, మీడియా నివేదికలు విద్యార్థి వయస్సు 6 సంవత్సరాలు అని పేర్కొన్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాల్పుల గురించి తమకు కాల్ వచ్చిందని న్యూపోర్ట్ పోలీస్ చీఫ్ స్టీవ్ డ్రూ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే, తమ టీం అక్కడికి చేరుకుందన్నారు. 


నిందితుడి సమాచారం ఇవ్వని పోలీసులు


విద్యార్థులు, కుటుంబాలను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. వారి యోగక్షేమాలపై కన్నవారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పోలీసులు అనుమానితుడి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. కాల్పులు జరిగిన న్యూపోర్ట్ సిటీలో 185,000 కంటే ఎక్కువ జనాభా ఉంది. ఈ పట్టణం చెసాపీక్, వర్జీనియా బీచ్ నుంచి 40 మైళ్ళ దూరంలో ఉంది. ఈ నగరం యు.ఎస్ నావికాదళానికి నౌకానిర్మాణానికి కూడా ప్రసిద్ది చెందింది.