Arshad Warsi - Maria Goretti: యూట్యూబ్ స్టాక్ మానిప్యులేషన్ కేసులో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi), అతని భార్య మరియా గోరెట్టికి (Maria Goretti) ఊరట లభించింది. వీళ్లు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయకుండా 'సెక్యూరిటీస్ మరియు ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) విధించిన నిషేధంపై 'సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్' (SAT) స్టే ఇచ్చింది.
సాధ్నా బ్రాడ్‌కాస్ట్‌లో తప్ప..
ఈ కేసులో విచారణ కొనసాగుతోంది కాబట్టి, సాధ్నా బ్రాడ్‌కాస్ట్ (Sadhna Broadcast) షేర్లలో తప్ప సెక్యూరిటీల మార్కెట్‌లో ట్రేడ్ చేయడానికి వార్సీ దంపతులకు ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది.
దీంతోపాటు.. "పంప్ & డంప్" స్కీమ్ ద్వారా చట్టవిరుద్ధంగా సంపాదించిన మొత్తం లాభాలను (100%) తిరిగి చెల్లించాలని సెబీ ఆదేశించగా, ఆ లాభాల్లో 50% మాత్రం ఎస్క్రో ఖాతాలో డిపాజిట్ చేయడానికి కూడా వార్సీ దంపతులను అనుమతించింది. మిగిలిన 50% మొత్తాన్ని, సెబీ తుది ఆర్డర్ విడుదల తేదీ నుంచి 30 రోజుల లోపు డిపాజిట్ చేస్తామని వాళ్లు హామీ పత్రం రాసి ఇవ్వాలి.
"WTM (whole time member) ప్రాథమిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా చాలా త్వరగా ఆర్డర్ పాస్ చేసింది. అప్పీలుదార్ల (అర్షద్ వార్సీ, అతని భార్య మారియా) విషయానికి వస్తే.. సందేహాస్పద స్క్రిప్‌లో పెట్టుబడులు పెట్టేలా సందేహాస్పదమైన పెట్టుబడిదార్లను ప్రేరేపించేలా అప్పీల్‌దార్లు ఒక ఉమ్మడి పథకంలో భాగంగా ఉన్నారని నిరూపించడానికి అప్పీలుదార్లకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు" - సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్
వార్సీ దంపతులపై సెబీ ఎందుకు నిషేధం విధించింది?
అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టితో పాటు, యూట్యూబర్ మనీష్ మిశ్రా, సాధ్నా బ్రాడ్‌కాస్ట్ ప్రమోటర్లు శ్రేయ గుప్త, గౌరవ్ గుప్త, సౌరభ్ గుప్త, పూజ అగర్వాల్, వరుణ్ మీడియా సెక్యూరిటీ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయకుండా సెబీ గతంలో నిషేధం విధించింది.
సాధ్నా బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్, షార్ప్‌లైన్ బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ కంపెనీల షేర్లను కొనుగోలు చేయండంటూ.. పెట్టుబడిదార్లను తప్పుదోవ పట్టించేలా "ది అడ్వైజర్" "మనీవైస్" YouTube ఛానెల్‌ళ్లలో వీళ్లు వీడియోలు అప్‌లోడ్ చేశారని సెబీ అప్పట్లో తేల్చింది. దీని ద్వారా ఆయా కంపెనీల షేర్ ధరల్ని కృత్రిమంగా పెంచారని నిర్ధరించింది. ఈ వీడియోలు విడుదలైన తర్వాత, షేర్ ధర & వాల్యూమ్‌లో విపరీతమైన జంప్ కనిపించింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో చూసిన రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టారు. షేర్ ధరలు పెరగ్గానే తమ వాటాలను అమ్మేసి నిందితులు లాభపడ్డారని సెబీ తన దర్యాప్తులో తేల్చింది. సాధ్నా బ్రాడ్‌కాస్ట్ ప్రమోటర్లకు కూడా ఈ మోసంలో భాగం ఉందని తేలింది.
అర్షద్ వార్సీ తదితరులు "పంప్ & డంప్" మోసానికి పాల్పడ్డారని; తద్వారా అర్షద్ వార్సీ రూ. 29.43 లక్షలు, అతని భార్య మరియా రూ. 37.56 లక్షల లాభం పొందారని, ఇక్బాల్ హుస్సేన్ వార్సీ రూ. 9.34 లక్షలు సంపాదించారని సెబీ వెల్లడించింది.
తప్పుదారి పట్టించే వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా అక్రమంగా లాభపడినందుకు వీళ్లందరిపై సెబీ రూ. 41.85 లక్షల జరిమానా విధించింది. వాళ్లు అక్రమంగా సంపాదించిన రూ. 54 కోట్ల లాభాలను తమకు స్వాధీనం చేయాలని కూడా ఆదేశించింది.
వార్సీ ఏమని ట్వీట్ చేశారు?
సెబీ తీసుకున్న చర్యలపై అర్షద్ వార్సీ అప్పట్లోనే స్పందించారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయకుండా తనతో పాటు తన భార్య మరియా గోరెట్టిపై నిషేధం విధించడంపై ట్వీట్ ద్వారా బాధను వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, తనకు & తన భార్య మరియాకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై అసలు అవగాహన లేదని, ఇతర ఇన్వెస్టర్ల మాదిరిగానే తాము కూడా పెట్టుబడి పెట్టామని, కష్టపడి సంపాదించిన డబ్బంతా పోయిందంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.