Rahul Gandhi : పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన 2 ఏళ్లు జైలు శిక్ష పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్ పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టులో వాదనలు జరిగాయి. కేసుకు సంబంధించిన రికార్డులు, న్యాయవిచారణ క్రమాన్ని తమకు సమర్పించాలని సూరత్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ ఆదేశించారు. అదే సమయంలో వేసవి సెలవుల తర్వాతనే తాను ఈ అంశంపై తీర్పు ఇస్తానని.. స్పష్టం చేశారు. రాహుల్‌కు రిలీఫ్ ఇచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
రాహుల్ గాంధీ ప్రజాప్రతినిధి అని, ఆయన ఏదైనా ప్రకటనలు చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా నిర్దిష్ట పరిమితులు లోబడి వ్యహరించాల్సి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ అన్నారు. రాహుల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. తన క్లయింట్ హత్య వంటి ఎలాంటి ఘోర నేరానికి పాల్పడలేదని, ఎలాంటి నైతిక ప్రమాణాలను అతిక్రమించ లేదని అన్నారు. సమాజానికి ఎలాంటి హాని లేనందున ఇది బెయిల్ ఇవ్వదగిన కేసు అని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన ప్రాంతంలో పూర్ణేష్ మోదీ పిటిషన్ వేసి ఉండవచ్చని, అలా చేయకపోవడాన్ని కూడా అనుమానించాల్సి వస్తోందని సింఘ్వి వాదించారు.
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంలో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ క్రిమినల్ పరువునష్టం కేసును పెట్టారు. దీన్ని విచారించిన సూరత్ న్యాయస్థానం రాహుల్ గాంధీని దోషిగా నిర్థారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం పూర్ణేష్ మోడీ తరుపున నిరుపమ్ నానావతి గుజరాత్ హైకోర్టులో వాదనలు వినిపించారు. రాహుల్ గాంధీ ఆశించినట్టుగా గుజరాత్ హైకోర్టు తీర్పు ఇస్తే.. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కాపాడుకుంటారు. లేదంటే, ఈ వేటు ఇలాగే కొనసాగడమే కాదు.. మరో 8 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను రాహుల్ గాంధీ కోల్పోతారు.