Gujarat Election 2022 Date:


నవంబర్ 1 లేదా 2న ప్రకటన..


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గుజరాత్ ఎన్నికల తేదీలు మరో రెండ్రోజుల్లో విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ భాజపాపై మండి పడుతున్నాయి. సొంత లబ్ధి కోసమే ఎన్నికల తేదీలు ప్రకటించటం లేదంటూ విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే...నవంబర్ 1  లేదా 2 న ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల (Gujarat Elections 2022) తేదీలు ప్రకటించే  అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.  నవంబర్ 30న లేదా డిసెంబర్ 1న తొలి విడత, డిసెంబర్ 4 లేదా 5న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. డిసెంబర్ 8న ఓట్లు లెక్కింపు జరుగుతుంది. 


భాజపా ఆపరేషన్ గుజరాత్..


ఆపరేషన్ గుజరాత్. ఇప్పుడు భాజపా టార్గెట్ ఇదే. ఈ రాష్ట్రంలో గెలవటం ఆ పార్టీకి చాలా అవసరం. ప్రతిష్ఠాత్మకం కూడా. అందుకే...ఎన్నికల బరిలోకి దిగేముందు అన్ని అస్త్రాలనూ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలు వెలువడినా...గుజరాత్ ఎలక్షన్ డేట్ ఇంకా తేలాల్సి ఉంది. తేదీలు ఖరారు కాక ముందే పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. అందరి కన్నా ముందుగా ఆప్‌ ప్రచారాన్ని వేగవంతం చేసింది. అటు భాజపా కూడా గౌరవ్ యాత్ర పేరిట క్యాంపెయిన్ షురూ చేసింది. ఎప్పుడూ హిందుత్వ కార్డుతో రాజకీయాలు చేసే భాజపా...ఈ సారి వ్యూహం మార్చుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలు ఊహించని విధంగా కొత్త వ్యూహాలతో ప్రచారంలోకి దూకాలని భావిస్తోంది. "మోదీ ఫ్యాక్టర్" వర్కౌట్ అవుతుందని ఆ పార్టీ ఎలాగో నమ్మకంగా ఉంది. అందుకే..ఈ సారి "హిందుత్వ" బదులుగా "మోదీత్వ" బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా...అక్కడ "మోదీ చరిష్మాను" వాడుకోవడం భాజపా వ్యూహం. అలాంటిది..మోదీ సొంత రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతుంటే...ఆ హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


మేధోమథనం..


ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో కీలక నేతలంతా భేటీ అయ్యారు. గుజరాత్ ఎన్నికల్లో ఏయే వ్యూహాలతో ముందుకెళ్లాలో ఈ భేటీలో చర్చించారు. కేంద్రహోం మంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరయ్యారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఈ భేటీలో పాల్గొని అధిష్ఠానంతో చర్చించారు. దాదాపు 5 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఏ ప్రాతిపదికన గుజరాత్‌లో భాజపా అభ్యర్థులను నిలబెట్టాలో ఈ సమావేశంలో చర్చించినట్టు ABP Newsకి విశ్వస నీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేమిటో ప్రస్తావించారు. ఆ అంశాలనే అజెండాలుగా మార్చుకుని ప్రచారం కొనసాగించాలని భాజపా భావిస్తున్నట్టు సమాచారం. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భాజపాకు దీటుగా ప్రచారం చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే పంజాబ్‌లో గెలిచిన ఊపుతో ఉన్న ఆ పార్టీ..అదే ఉత్సాహంతో గుజరాత్‌లోనూ భాజపాను ఢీకొట్టేందుకు రెడీగా ఉంది. భాజపాను ఓడించటం అంత సులభమేమీ కాకపోయినా...కనీసం గట్టిపోటీ ఇచ్చినా అది తమ విజయమే అని ఆప్‌ భావిస్తోంది. అందుకే...ఈ సారి ఆప్, భాజపా మధ్య ప్రధాన పోటీ కనిపించేలా ఉంది. 


Also Read: Airplane Fire Incidents: ఈ విమానాలకు ఏమైంది, ఓ వైపు మంటలు మరో వైపు పొగలు