National Flag Disposal: రిపబ్లిక్ వేడుకల సందర్భంగా New Delhi Municipal Council (NDMC) కీలక మార్గరద్శకాలు జారీ చేసింది. గణతంత్ర వేడుకలు ముగిసిన తరవాత జాతీయ జెండాలను డిస్పోజ్ చేసే విషయంలో జాగ్రత్తలు (National Flag Disposal) పాటించాలని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా రాముడి జెండాలు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. ఆ జెండాలన్నింటినీ ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదని స్పష్టం చేసింది NDMC.ఇందుకోసం సంస్థ ప్రత్యేకంగా ఓ ఫోన్‌ నంబర్‌ని కేటాయించింది. జెండాలను డిస్పోజ్ చేయాలనుకునే వాళ్లు యాప్‌లోనూ సంప్రదించే విధంగా ఏర్పాట్లు చేసింది. జెండా పూర్తిగా చినిగిపోయినప్పటికీ అలా ఇష్టమొచ్చినట్టు పారేయకూడదని వివరించింది. తమకు వివరాలు అందిస్తే వాటిని సరైన పద్ధతిలో డిస్పోజ్ చేస్తామని తెలిపింది. మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని అన్ని వెల్ఫేర్ అసోసియేషన్స్‌తో పాటు మార్కెట్ ట్రేడర్స్ అసోసియేషన్స్‌కీ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. తమతమ ప్రాంతాల్లోని శానిటేషన్ ఆఫీస్‌లలో ఆ జెండాలు అందజేయాలని కోరింది. ఈ కౌన్సిల్ పరిధిలో దాదాపు 14 చోట్ల ఈ శానిటేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేసింది. జాతీయ జెండాతో పాటు రాముడి జెండాలనూ ఇక్కడ అందించాలని వివరించింది. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. వాళ్ల కాంటాక్ట్ నంబర్స్‌నీ ప్రజలకు అందుబాటులో ఉంచింది. 1533 కి కాల్‌ చేసి ఆ జెండాలను అప్పగించే విధంగా ఏర్పాట్లు చేసింది. NDMC 311 app ద్వారా కూడా వీటిని సేకరించనున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్ ఇచ్చారు. Flag Code ప్రకారమే నడుచుకోవాలని తేల్చి చెప్పారు అధికారులు. అటు రాముడి జెండాలనూ ఇవే నిబంధనలు పాటిస్తూ డిస్పోజ్ చేయాలని తెలిపారు.