చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎంత మంది పీకేలను పెట్టుకున్నా.. సీఎం జగన్ ను పీకేదెం ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని.. సీఎం జగన్, తాము రోజూ చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలిస్తే భూమి బద్దలై పోతుందా అని మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ ను తాము పూర్తిగా వాడేశామని, ఇక ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు.


తమ వ్యూహకర్తగా ఉన్నప్పుడు బిహార్ నుంచి వచ్చిన పీకే ఏం పికుతాడని చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఏం పికడానికి ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే జగన్ బాబాయ్ ని చంపి, జగన్ కోడి కత్తి డ్రామాలు అడారని ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందని ఆరోపించారు. మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకుంటాడా అని ఎద్దేవా చేశారు. లేదా లోకేష్ తండ్రిని చంపడానికి ప్లాన్ వేస్తున్నారా? అని ప్రశ్నించారు.


ప్రశాంత్ కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదని.. ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చారని కొడాలి నాని అన్నారు. పాట్నర్ పీకే బీజేపీతో చర్చలు జరుపుతుంటే మరో పీకే ఇండియా కూటమి, మమతా బెనర్జీ, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారని అన్నారు. చంద్రబాబు తన రెండు కళ్ళ సిద్దాంతాన్ని కొనసాగిస్తున్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు.