వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్  కోర్సులతో పాటు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్(బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(బీసీఏ) కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది. ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ వీటిని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ రెండు కోర్సులకు మార్కెట్‌లో గణనీయమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. ఏళ్లుగా ఈ కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేమితో బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీజెడ్‌సీ, ఇతర రెగ్యులర్ కోర్సులనే ఎక్కువ మంది అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని డిగ్రీ కళాశాలల్లో మాత్రమే బీబీఏ, బీసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు పోటీపడుతున్నారు. ఒక్కో కోర్సులో 60 మంది ప్రవేశం పొందవచ్చు. పీజీ స్థాయిలో ఎంబీఏ చేయాలనుకునేవారు బీబీఏ, ఎంసీఏ అభ్యసించాలనుకునేవారు బీసీఏను ఎంపిక చేసుకుంటున్నారు.

బీబీఏ అభ్యసిస్తే..
వ్యాపార నిర్ణయాలు తీసుకోవటం, నాయకులుగా మారేందుకు బీబీఏ కోర్సు ఉపకరిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వ్యాపారాల్లో అద్భుతమైన కెరీర్ పురోగతికి బాటలు వేస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ట్రైనీ మేనేజర్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో ప్రవేశించే వెసులుబాటు ఉంటుంది. సంస్థలు ఎలా పనిచేస్తాయనే అంశంపై బీబీఏ విద్యార్థులకు సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. పరిశ్రమను అర్థం చేసుకోవటానికి కావాల్సిన నైపుణ్యాలనూ ఈ కోర్సు అందిస్తుంది. స్వయం నిర్ణయానికి అవకాశం కల్పిస్తుంది.

బీసీఏ చదివితే..
కంప్యూటర్ అప్లికేషన్ల చుట్టూ సిలబస్ తిరుగుతుంది. బీసీఏ కోర్సు విద్యార్థులకు కంప్యూటర్ ఇన్నోవేషన్ పరిశ్రమల్లో అధిక డిమాండ్ ఉంటుంది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ సైన్సు రంగంలో సాంకేతిక మార్పులతో బీసీఏ డిగ్రీ ముందంజలో ఉంది.


స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత శిక్షణ..
తెలంగాణ‌లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో జనవరి 2న సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ..తెలంగాణ ప్రభుత్వానికి చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ/పట్టణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తారు. అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు ప్రారంభ వేతనంగా రూ.6000 - రూ.8000 వరకు ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల నుంచి ఏడాది కాలంలో నిబంధనల ప్రకారం వేతన పెంపు ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9133908000, 9133908111, 913390822, 9949466111 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


'స్కిల్' కోర్సులకు యూజీసీ మార్గదర్శకాలు వెల్లడి, సూచనలకు ఆహ్వానం
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో స్వల్పకాలిక 'స్కిల్ డెవలప్‌మెంట్' కోర్సులను ప్రవేశపెట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) డిసెంబరు 18న మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై సలహాలు, సూచనలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఆర్టిఫీషియన్ ఇంటెలిజెన్స్ (AI)-మెషిన్ లెర్నింగ్, ఏఐ-రోబోటిక్స్, ఐఓటీ, ఇండస్ట్రీస్ ఐఓటీ, డేటా సైన్స్, అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి 29 విభాగాల్లో స్వల్పకాలిక నైపుణ్య కోర్సులను యూజీసీ సూచించింది. మౌలిక సదుపాయాలు, శిక్షణ సామర్థ్యం ఆధారంగా ఆయా కళాశాలలు ఈ కోర్సులను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...