Govt tells WhatsApp and telegram to do mandatory SIM : కమ్యూనికేషన్ యాప్స్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకు వచ్చింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్‌కు సిమ్ కార్డ్ బైండింగ్‌ను తప్పనిసరి చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోతే లేదా సిమ్ తొలగించినా యాప్ సేవలు ఆటోమాటిక్‌గా ఆగిపోతాయి. ఈ నిబంధనలు 90 రోజుల్లో అమలులోకి వస్తాయి. సైబర్ నేరాలను అరికట్టడానికి ఈ చర్యలు అవసరమని కేంద్రం నిర్ణయించింది.
యాప్స్‌కు తప్పనిసరి సిమ్ బైండింగ్: ఎలా పనిచేస్తుంది?
కేంద్రం జారీ చేసిన 'టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ (అమెండ్‌మెంట్) రూల్స్, 2025' ప్రకారం, కమ్యూనికేషన్ సేవలు అందించే OTT యాప్స్‌ను 'టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ యూజర్ ఎంటిటీస్ (TIUEs)'గా పేర్కొంటారు. ఈ యాప్స్ తమ సేవలకు సిమ్ కార్డ్‌తో అనుసంధానం (బైండింగ్) అవ్వాలి.
సిమ్ ధ్రువీకరణ: యాప్ ఇన్‌స్టాలేషన్ సమయంలోనే యూజర్ సిమ్ కార్డ్‌ను ధ్రువీకరించాలి. ఆ తర్వాత, డివైజ్‌లో ఆ సిమ్ మాత్రమే ఉంటేనే యాప్ పనిచేయాలి.
సిమ్ తొలగించినా లాగౌట్: సిమ్ కార్డు తీసేస్తే లేదా ఫోన్ మార్చితే యాప్ ఆటోమాటిక్‌గా లాగౌట్ అవుతుంది. మళ్లీ లాగిన్ కావాలంటే, ఆ సిమ్‌తో మాత్రమే పునఃధ్రువీకరణ చేయాలి.
వెబ్ వెర్షన్ పరిమితి: యాప్‌ను వెబ్ బ్రౌజర్‌లో ఉపయోగిస్తే, ప్రతి 6 గంటలకు లాగౌట్ అవుతుంది. మళ్లీ సేవలు పొందాలంటే QR కోడ్ ద్వారా మొబైల్ సిమ్‌తో లాగిన్ అవ్వాలి.
డీయాక్టివేటెడ్ సిమ్‌లు: డీయాక్టివేట్ అయిన లేదా ఇన్‌వాలిడ్ సిమ్‌తో యాప్ సేవలు కొనసాగకూడదు. ఇది సైబర్ నేరస్థులు డీయాక్టివ్ సిమ్‌లను దుర్వినియోగం చేయకుండా అడ్డుకుంటుంది.
ప్రస్తుతం ఈ యాప్స్ ఇన్‌స్టాలేషన్ సమయంలో సిమ్‌ను ధ్రువీకరిస్తున్నా, సిమ్ తొలగించినా లేదా డీయాక్టివేట్ చేసినా సేవలు కొనసాగుతున్నాయి. ఈ లోపాన్ని సరిదిద్దేందుకే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు.
సైబర్ నేరాలు, దుర్వినియోగం అరికట్టడం
భారతదేశంలో OTT కమ్యూనికేషన్ యాప్స్ ద్వారా సైబర్ నేరాలు, మోసపూరిత కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే నేరస్థులు ఈ యాప్స్‌ను వాడుకోవడం సులభమవుతోందని DoT అధికారులు చెబుతున్నారు. సిమ్ బైండింగ్‌తో యూజర్ ఐడెంటిటీ ధృవీకరణ మరింత బలపడుతుంది. సైబర్ నిపుణులు. ఇది మోసాలు, ఫిషింగ్, టెరర్ యాక్టివిటీలను 30-40% తగ్గిస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఇది యూపీఐ పేమెంట్ యాప్స్‌లో ఇప్పటికే అమలులో ఉన్న సిమ్ బైండింగ్ మోడల్‌కు సమానం.