Sai Durgha Tej Releases Discover Andhra Glimpse : ఏపీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో శ్రీకాంత్ మన్నెపురి 'డిస్కవర్ ఆంధ్ర' డాక్యుమెంటరీ తెరకెక్కించారు. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ సారథ్యంలో ఈ డాక్యుమెంటరీ రూపొందించగా... పడాల సురేందర్ రెడ్డి, శ్రావ్య కూనం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా... ఈ డాక్యుమెంటరీ టైటిల్ గ్లింప్స్ లాంచ్ చేశారు.
కల్చర్... నేచర్... మనమే కాపాడుకోవాలి
మన కల్చర్... నేచర్ మనమే కాపాడుకోవాలని సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పిలుపునిచ్చారు. 'డిస్కవర్ ఆంధ్ర'లో ఉండే నేచర్‌ను ఇంత అద్భుతంగా చూపిస్తోన్న శ్రీకాంత్‌కు థాంక్స్ చెప్పారు. 'ఈ డాక్యుమెంటరీ చూస్తే మన చుట్టూనే ఇన్ని అద్భుతాలు ఉన్నాయా? అని అనిపించక మానదు. 2020లో నాకు ఈ వైల్డ్ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచనలు వస్తే ‘గ్రీన్ పాస్’ అనే ఎన్జీవోని నా స్నేహితుడితో కలిసి ప్రారంభించా.
బీచ్ క్లీన్ చేయడం, కోస్టల్ ఏరియాలోని జీవుల్ని, పక్షుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. మన చుట్టూ ఉన్న ఈ వైల్డ్ లైఫ్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. 'రిపబ్లిక్' మూవీలో పర్యావరణ పరిరక్షణ గురించి చాలా చెప్పాం. ఈ మూవీలో మన వైల్డ్ లైఫ్ గురించి మనకు ఎంతో అద్భుతంగా చెప్పబోతున్నారు. మన కల్చర్, మన నేచర్‌ను మనమే కాపాడుకోవాలి. శ్రీకాంత్‌కు పెద్ద విజయం దక్కాలి. ఈ ప్రాజెక్ట్‌కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. మణిశర్మ గారు ఈ ప్రాజెక్ట్‌కి సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్‌లకు మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలి.' అని కోరారు.
72 నిమిషాల రన్ టైం...
శ్రీకాంత్ ఈ డాక్యుమెంటరీ తీసి ఇదంతా ఏపీలోనిదే అని చెప్పడంతో నిజంగా షాకైనట్లు హీరో నవదీప్ తెలిపారు. 'నేను ఓ సారి అడవిలో వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చేసి వచ్చాక రిఫ్రెష్, రీసెట్ ఫీల్ అయ్యా. మన సమాజంలో పక్క జీవుల్ని హింసిస్తూ బతికేస్తున్నాం. ఆంధ్రలో వైల్డ్ లైఫ్ ఎక్స్‌ప్లోర్ చేయాలని శ్రీకాంత్ కంకణం కట్టుకున్నాడు. ఈ జర్నీలో నాకు వీలైనంతగా శ్రీకాంత్‌కు సపోర్ట్ చేశా. ఈ విజువల్స్ చూసి సాయిదుర్గా తేజ్ మాకు థాంక్స్ చెప్పారు. ఆంధ్రలోని వైల్డ్ లైఫ్‌ను బయటకు తీసుకురావాలని అనుకుంటున్నట్లు తేజ్ చెప్పారు.
వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించి కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందేలా చేశారు. తెలుగు జాతి గర్వపడేలా మన ఆంధ్రలోని అద్భుతాల్ని చూపించాలని శ్రీకాంత్ ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడ్డారు. 72 నిమిషాల రన్ టైంతో అద్భుత డాక్యుమెంటరీని శ్రీకాంత్ చూపించబోతోన్నారు. మన రాష్ట్రంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా? అని డాక్యుమెంటరీ చూసిన తరువాత అందరూ ఆశ్చర్యపోతారు.' అని అన్నారు.
ఆంధ్రలోనే అద్భుతాలు
తన గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత తాను ఎక్కువగా వైల్డ్ లైఫ్ గురించి రీసెర్చ్ చేసినట్లు 'డిస్కవర్ ఆంధ్ర' డాక్యుమెంటరీ డైరెక్టర్ శ్రీకాంత్ మన్నెపురి తెలిపారు. 'ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ప్లేస్ గురించి చెప్పారు. కానీ మన తెలుగు రాష్ట్రాల గురించి ఎవ్వరూ చెప్పలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో వాలంటీర్‌గా చేసిన తరువాత నాకు చాలా విషయాలు తెలిశాయి. మన ఆంధ్రలోనే ఎన్నో అద్భుతాలున్నాయి.
మన దగ్గర ఉన్న వాటి గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాను. వైల్డ్ లైఫ్ అంటే ఆంధ్ర అనేది గుర్తుకు రావాలని అనుకుంటున్నా. ఇప్పుడు మీకు కేవలం టైటిల్, గ్లింప్స్ మాత్రమే చూపించాం. త్వరలోనే ట్రైలర్‌తో అందరినీ కట్టి పడేస్తాం. మాకు ఈ ప్రయాణంలో సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, నవదీప్ గారికి, సాయి దుర్గ తేజ్ గారికి థాంక్స్. మ్యూజిక్ ఇచ్చి సపోర్ట్ చేసిన మణిశర్మ గారికి థాంక్స్.' అని అన్నారు.