Viral Video: జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో ఆగిన గూడ్స్ ట్రైన్‌ కాసేపటి తరవాత మళ్లీ ప్రయాణం మొదలు పెట్టింది. ట్రైన్ అన్నాక ఆగుతుంది..వెళ్తుంది..ఇందులో వింతేముంది..అనుకోవచ్చు. కానీ...కథువాలో ఆగిన తరవాత డ్రైవర్ లేకుండానే స్టార్ట్ అయింది ఆ గూడ్స్ ట్రైన్. అలా 84 కిలోమీటర్ల మేర డ్రైవర్ లేకుండానే పట్టాలపై దూసుకుపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇది గుర్తించిన అధికారులు పంజాబ్‌లోని ముకెరియన్‌ స్టేషన్ వద్ద ఎలాగోలా కష్టపడి ఆ రైల్‌ని ఆపేశారు. ఇవాళ ఉదయం (ఫిబ్రవరి 25) 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాంక్రీట్‌ని తీసుకెళ్తున్న ఈ గూడ్స్ ట్రైన్‌...పఠాన్‌కోట్ వైపుగా పల్లం ఉండడం వల్ల డ్రైవర్ లేకుండానే ముందుకు దూసుకెళ్లిపోయింది. కథువా స్టేషన్ వద్ద టీ కోసం ఆపి డ్రైవర్‌, కో డ్రైవర్‌ కిందకు దిగారు. ఆ తరవాత ఉన్నట్టుండి రైల్ ముందుకు కదిలింది. అప్పటికి ఇంజిన్ ఆన్ చేసి ఉన్నట్టు సమాచారం. ఆ సమయంలో హ్యాండ్ బ్రేక్‌ వేయడానికి కూడా డ్రైవర్ ప్రయత్నించలేదని తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే ట్రైన్‌ని ఆపేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్యాసింజర్ ట్రైన్స్‌ స్టాఫ్‌ సాయంతో మొత్తానికి ఆపగలిగారు. ఈ ట్రైన్‌కి ఎదురుగా మరో రైల్ రాకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే ఏం జరిగి ఉండేదో అని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రైల్వే విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు వెల్లడించారు. డ్రైవర్ లేకుండానే దూసుకుపోయిన ఈ గూడ్స్ ట్రైన్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.