Multiplexes Ticket Prices: సినిమా టికెట్ రేట్లపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ సినిమా అయినా సరే టికెట్ ధర రూ.200 మించకూడదని ధర పరిమితిని విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లపై ధర పరిమితి రూ.200 మించకూడదని ఆదేశాలు జారీ చేసింది.  ఈ నిబంధన  మల్టిప్లెక్స్‌లకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం మల్టిప్లెక్స్‌లలో మినిమం మూడు వందలరూపాయల టిక్కెట్ ప్లస్ టాక్సులు, ఇతర చార్జీలు వసూలు చేస్తున్నారు.ఇటీవలి కాలంలో బెంగళూరు మల్టిప్లెక్స్ లు డిమాండ్ ను బట్టి టిక్కెట్ రేట్లను సవరిస్తూ వస్తున్నాయి. కొత్త సినిమా వస్తే టిక్కెట్ రేటును ఐదు వందల వరకూ చేస్తున్నాయి. అదే సమయంలో ప్రైమ్ టైమ్ షోలకు ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నాయి. కర్ణాటక వ్యాప్తంగా సింగిల్ ధియేటర్లలోనూ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. 

కర్ణాటక ప్రభుత్వం హఠాత్తుగా కేవలం రెండు వందల రూపాయల వరకే టిక్కెట్ రేట్లను పరిమితం చేయడంతో కన్న చిత్ర పరిశ్రమకు.. అక్కడి ఎగ్జిబిటర్లకు గట్టి షాక్ అనుకోవచ్చు. అయితే చిత్ర పరిశ్రమపై ఆగ్రహంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల డిప్యూటీ సీఎం శివకుమార్ కన్నడ చిత్ర సీమపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం..రాష్ట్రం  కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు. చిత్ర పరిశ్రమకు నట్లు, బోల్టులు బిగించాల్సిన సమయం వచ్చిందని కూడా అన్నారు. 

ఇటీవల 16వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగింది.  ఈ చిత్రోత్సవానికి  కన్నడ చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా నటులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ముఖ్యంగా బెంగళూరు, పరిసర ప్రాంతాలకు తాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన మేకెదాతు ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వకపోవడంపైనా ఆయన సినీ పరిశ్రమలపై మండిపడ్డారు. చలన చిత్రోత్సం ఏమీ  సిద్ధరామయ్య  లేదా డికె శివకుమార్ ప్రైవేట్ కార్యక్రమం కాదన్నారు.  ఇది ఒక పరిశ్రమ కార్యక్రమం. నటులు, దర్శకులు, నిర్మాతలు హాజరు కాకపోతే, మరెవరు హాజరు అవుతారని అసహనం వ్యక్తం చేశారు. అప్పుడే ప్రభుత్వం మద్దతు , అనుమతులు ఇవ్వకపోతే, సినిమా నిర్మాణం జరగదు. ఎక్కడ నట్లు బిగించాలో కూడా తెలుసన్నారు.              

శివకుమార్ ఇలా అన్న కొద్ది రోజులకే .. రెండు వందల రూపాయల వరకే టిక్కెట్ ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదనపు షోలకూ అవకాశం లభించదని భావిస్తున్నారు. ప్రభుత్వాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సినీ తారల వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని.. అదే సమయంలో.. ప్రభుత్వాలు కూడా సినీ పరిశ్రమ తమకు తగ్గి ఉండాలని భావించడం వల్లనే ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా ఇప్పుడు బెంగళూరులో ఎ మల్టిప్లెక్స్ కు వెళ్లిన రెండు వందల రూపాయలే టిక్కెట్. సినీ లవర్స్ కు మాత్రం ఇది సంతోషకరమైన వార్తే.   

Also Read:  డేంజర్‌గా మారిన చికెన్ బిర్యానీ బోన్ - గొంతులో ఇరుక్కోవడంతో 8 గంటలు ఆపరేషన్ !