Goa Crime:
అంజున బీచ్‌కు సమీపంలో..
ఢిల్లీ నుంచి గోవాకు వచ్చిన ఓ ఫ్యామిలీపై దుండగులు కత్తులతో దాడి చేయడం కలకలం రేపింది. అంజున బీచ్‌లో ఈ దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. బీచ్‌కు దగ్గర్లోని ఓ రిసార్ట్‌లో ఆ కుటుంబం ఉంటోందని చెప్పారు. మొదట కొందరు వ్యక్తులు వచ్చి వారిని బెదిరించారు. ఆ తరవాత ఉన్నట్టుండి కత్తులతో దాడి చేశారు. ఈ కుటుంబంలోని ఓ సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దాడి జరిగిన వెంటనే రిసార్ట్ సిబ్బంది, యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ తరవాత పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు, నలుగురు దుండగులు వచ్చి దాడి చేసినట్టు బాధితులు చెప్పారు. అలెర్ట్ అయిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే...అరెస్ట్ చేసిన కాసేపటికే వాళ్లను విడుదల చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విటర్ వేదికగా హామీ ఇచ్చారు.
"ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించాను. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాను. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం"
- ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి
అయితే...దాడి జరుగుతున్నప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ సాయం కోసం గట్టిగా అరుస్తుండగా ముగ్గురు, నలుగురు దుండగులు వచ్చి వాళ్లపై దాడి చేశారు. రిసార్ట్‌లో పని చేసే వాళ్లతో వాగ్వాదం అయిందని, బహుశా వాళ్లపై దాడి చేయడానికి ఇదే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.