Gangster Mukhtar Ansari son disqualifie From MLA Post : యూపీలో ముక్తార్ అన్సారీ గురించి చెప్పాల్సిన పని లేదు. పేరు మోసిన గ్యాంగ్ స్టర్ . ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుమారుడిపై అనర్హతా వేటు పడింది. ముక్తార్ అన్సారీ కుమారుడు అబ్బాస్ అన్సారీ ప్రస్తుతం  ఉత్తరప్రదేశ్‌లోని మౌ సదర్ నియోజకవర్గం నుంచి సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2022లో జరిగిన ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమిలో భాగంగా SBSP టికెట్‌పై గెలుపొందాడు. 

2022 ఎన్నికల సమయంలో  రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన కేసులు నమోదయ్యాయి.  మౌ జిల్లాలోని పహర్‌పూర్ గ్రౌండ్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో అబ్బాస్ అన్సారీ మాట్లాడారు. ఈ సభలో అతను మౌ జిల్లా అధికారులను బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.  "ఎన్నికల తర్వాత అధికారులను ఉద్దేశించి  లెక్కలు తీర్చుకుంటాం ..బుద్ధి చెబుతాం" హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల పాటు అధికారుల బదిలీలు ఉండవు, ముందు వారి లెక్కలు తీర్చుకుంటాం" అని బెదిరిపులకు పాల్పడ్డారు. ఈ అంశాన్ని తాను అఖిలేష్ తో కూడా మాట్లాడినట్లుగా చెప్పాడు. 

ఈ హెచ్చరికలు వైరల్ కావడంతో అబ్బాస్ అన్సారీ, అతని సోదరుడు ఉమర్ అన్సారీ, అతని ఎన్నికల ఏజెంట్ మన్సూర్ అన్సారీపై  మతం, కులం, జాతి ఆధారంగా విద్వేషాన్ని ప్రోత్సహించడం  కింద కేసు నమోదు చేశారు.  మౌ జిల్లాలోని ప్రత్యేక MP-MLA కోర్టు, మే 31, 2025న అబ్బాస్ అన్సారీని ఈ కేసులో దోషిగా నిర్ధారించింది. అతనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 3,000 జరిమానా విధించింది.  రిప్రెజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్, 1951 ప్రకారం, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష కు గురైన ఎమ్మెల్యే లేదా ఎంపీ శాసనసభ సభ్యత్వం నుంచి అనర్హత వేటుకు గురవుతారు  

ఈ నిబంధన ఆధారంగా అబ్బాస్ అన్సారీ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.  మౌ సదర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్ నజారీ చేశారు. అబ్బాస్ అన్సారీ లీగల్ టీమ్ ఈ తీర్పుపై అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ప్రకటించింది. SBSP అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ కూడా అబ్బాస్ తరపున హైకోర్టులో అప్పీల్ చేస్తామని తెలిపారు.  ఒకవేళ హైకోర్టు ఈ తీర్పును సస్పెండ్ చేస్తే అనర్హతా వేటును నిలిపివేయవచ్చు.