Ganesh Visarjan Haryana:
హరియాణాలో నలుగురు చిన్నారులు మృతి
హరియాణాలోని మహేంద్రగర్‌లో గణేష్ నిమజ్జనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. జగడోలి గ్రామానికి సమీపంలోని ఓ కాలువ వద్దకు గణేష్ నిమజ్జనం కోసం దాదాపు 20 మంది వెళ్లారు. వారిలో నలుగురు అనుకోకుండా నీటిలో మునిగిపోయి చనిపోయారు. మరో నలుగురు కూడా నీటిలో మునిగిపోగా...రెస్క్యూ టీమ్ వారిని కాపాడింది. "గణేష్ నిమజ్జనం కోసం వచ్చిన వాళ్లు ఉన్నట్టుండి నదిలో మునిగిపోయారు. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా...మరో నలుగురుని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం" అని మహేంద్రగర్ డీసీ వెల్లడించారు. ఇక్కడే కాదు. సోనిపట్‌లోనూ ఇదే తరహా విషాదం జరిగింది. నిమజ్జనం కోసం వచ్చి నీటిలో మునిగిపోయి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. సోనిపట్‌లోని మిమార్‌పూర్ ఘాట్ వద్ద వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఓ వ్యక్తి తన కుమారుడు, అల్లుడితో కలిసి వచ్చాడు. నిమజ్జనం చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఈ ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు బయటకు వెలికితీశారు. ఈ ప్రమాదాలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులతు సానుభూతి తెలిపారు. "సోనిపట్, మహేంద్రగర్‌లో జరిగిన ఘటనలు చాలా బాధాకరం. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కొంత మందిని రక్షించటం సంతోషం. వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఉన్నావ్ సమీపంలో గణేష్ నిమజ్జనం కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు. మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆసుపత్రిలో చేర్చారు. కాసేపటికే ఆ బాలుడు కూడా మృతి చెందాడు.